Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ద్వితీ 16

పస్కా పండగ

“మీరు ఆబీబు నెలలో పండగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు. యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి.

పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి. మీ పరిసరాల్లో ఏడు రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు.

మీ దేవుడు యెహోవా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు. మీ దేవుడు యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకునే స్థలం లోనే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి. అదే స్థలం లో దాన్ని కాల్చి, తిని, ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి. ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు.

వారాల పండగ

మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి. మీ యెహోవా దేవునికి వారాల పండగ ఆచరించడానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి. అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాథలు, వితంతువులు మీ యెహోవా దేవుడు తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం లో ఆయన సన్నిధిలో సంతోషించాలి. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, ఈ కట్టడలను పాటించి అమలు జరపాలి.

పర్ణశాలల పండగ

మీ కళ్ళంలో నుండి ధాన్యాన్ని, మీ తొట్టిలో నుండి ద్రాక్షరసాన్ని తీసినప్పుడు పర్ణశాలల పండగను ఏడు రోజులపాటు ఆచరించాలి. ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణలో నివసించే లేవీయులు, పరదేశులు, అనాథలు, వితంతువులు సంతోషించాలి. మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతిపనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీ యెహోవా దేవునికి ఏడురోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి.

సంవత్సరానికి మూడుసార్లు, అంటే పొంగని రొట్టెల పండగలో, వారాల పండగలో, పర్ణశాలల పండగలో మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీలో ఉన్న పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనిపించకుండా, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడూ తన శక్తి కొలదీ ఇవ్వాలి.

న్యాయాధిపతులు

మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి. మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది.

ఇతర దేవతలను ఆరాధించడం

మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి. యెహోవా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు, దేవతా స్తంభాన్నీ నిలబెట్టకూడదు. మీ యెహోవా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు ఏ స్తంభాన్నీ నిలబెట్టకూడదు.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.