Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ద్వితీ 15

అప్పులు రద్దు చేయడం

ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే, తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు. ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తి పై ఒత్తిడి తేవచ్చు గాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి. మీరు స్వాధీనం చేసుకోడానికి యెహోవా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.

కాబట్టి ఈ రోజు నేను మీకు ఆదేశించే యెహోవా దేవుని ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా విని పాటిస్తే మీలో పేదవాళ్ళు ఉండనే ఉండరు. ఎందుకంటే ఆయన మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు ఇతరులు అనేకులకు అప్పిస్తారు గాని అప్పు చెయ్యరు. అనేక రాజ్యాలను పాలిస్తారు గాని ఎవరూ మిమ్మల్ని పరిపాలించరు.

మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.

కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

పనివారిని, బానిసలను స్వతంత్రులుగా చేయడం

మీ సోదరుల్లో మీరు కొన్న హెబ్రీయుడు, లేక హెబ్రీయురాలు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేసిన తరవాత ఏడో సంవత్సరం వారికి విడుదలనిచ్చి నీ దగ్గర నుండి పంపివేయాలి. అయితే ఆ విధంగా పంపేటప్పుడు మీరు వారిని వట్టి చేతులతో పంపకూడదు. వారికి మీ మందలో, ధాన్యంలో, మీ ద్రాక్ష గానుగలో నుండి ఉదారంగా ఇవ్వాలి. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకిచ్చిన కొలదీ వారికి ఇవ్వాలి.”

మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈ రోజు మీకు ఆజ్ఞాపించాను. అయితే వారు నీ దగ్గర పొందిన మేలును బట్టి మిమ్మల్ని, మీ ఇంటివారిని ప్రేమించి “నేను మీ దగ్గర నుండి వెళ్లిపోను” అని మీతో చెబితే, మీరు ఒక లోహపు ఊచ తీసుకుని, తలుపులోకి దిగేలా వాడి చెవికి దాన్ని గుచ్చాలి. ఆ తరువాత అతడు ఎన్నటికీ మీకు దాసుడుగా ఉంటాడు. అదే విధంగా మీరు మీ దాసికి కూడా చేయాలి.

మీ దాసులను స్వతంత్రులుగా విడిచిపెట్టడాన్ని కష్టంగా భావించకూడదు. ఎందుకంటే వారు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేయడం ద్వారా జీతగాడికి మీరు చెల్లించే జీతానికి రెండు రెట్లు లాభం మీకు కలిగింది. మీ యెహోవా దేవుడు మీరు చేసే వాటన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

తొలి చూలు పశువులు

మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో ప్రతి తొలి చూలు మగపిల్లను యెహోవా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెల్లో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెలు, మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు.

మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీరు, మీ ఇంటివారు ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం దాన్ని తినాలి. దానిలో లోపం, అంటే కుంటితనం గాని, గుడ్డితనం గాని, మరే లోపమైనా ఉంటే మీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు. జింకను, దుప్పిని తినే విధంగానే, పట్టణాల్లోని మీ ఆవరణల్లో పవిత్రులు, అపవిత్రులు కూడా దాన్ని తినవచ్చు. వాటి రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.