Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 99
యెహోవా పరిపాలిస్తారు,
ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు;
కెరూబులకు1 పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు,
భూమి కంపించాలి.
సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా
అందరికంటే పైన ఉన్నారు.
వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు,
మీరు పరిశుద్ధులు.
రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు
కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు;
యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల
నీతి నాయ్యాలు జరిగిస్తారు.
మన దేవుడైన యెహోవాను మహిమపరచండి
ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి;
ఆయన పవిత్రులు.
దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు,
యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు;
వారు దేవునికి ప్రార్థన చేశారు,
ఆయన జవాబిచ్చారు.
మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు.
వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.
యెహోవా మా దేవా,
మీరు వారికి జవాబిచ్చారు.
మీరు వారికి క్షమించే దేవుడు,
కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.
మన దేవుడైన యెహోవాను ఘనపరచండి
ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి.
ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.
Source notes (1)
- Footnote కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.