Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 10
యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు?
నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు,
వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.
వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు;
వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.
దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు;
వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.
వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి;
వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు;
వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.
“ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు”
అని వారు తమలో తాము అనుకుంటారు.
వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి;
ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.
వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు;
చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు.
నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;
గుహలో సింహంలా వారు వేచి ఉంటారు.
నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు;
వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
బాధితులు నలిగి కుప్పకూలిపోతారు;
వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.
“దేవుడు ఎప్పటికీ గమనించరు;
ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు”
అని వారు తమలో తాము అనుకుంటారు.
యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి.
నిస్సహాయులను మరువకండి.
దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు?
“దేవుడు నన్ను లెక్క అడగరు”
అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?
దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు;
వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు.
నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు;
తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
దుష్టుల చేతిని విరగ్గొట్టండి.
కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి
ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.
యెహోవా నిరంతరం రాజై ఉన్నారు;
దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.
యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు;
మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.
తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు,
అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.