Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

మత్తయి సువార్త 6

అవసరంలో ఉన్నవారికి సహాయపడుట

“మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు.

“కాబట్టి మీరు ఎవరికైనా దానం చేస్తే ఇతరుల నుండి ఘనత పొందాలని సమాజమందిరాల్లోను వీధుల్లోను ప్రకటించుకునే వేషధారుల్లా బూరలు ఊదించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.

ప్రార్థన

“మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి. మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి.

“మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి:

“ ‘పరలోకమందున్న మా తండ్రీ,

మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

మీ రాజ్యం వచ్చును గాక;

పరలోకంలో జరుగునట్లు భూమి మీద,

మీ చిత్తం జరుగును గాక.

మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.

మా రుణస్థులను మేము క్షమించినట్లు

మా రుణాలను క్షమించండి.

మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి,

దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’

మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.

ఉపవాసం

“మీరు ఉపవాసం ఉన్నప్పుడు, తాము ఉపవాసం ఉంటున్నామని ఇతరులకు తెలియాలని తమ ముఖాలను నీరసంగా పెట్టుకొనే వేషధారుల్లా నీరసంగా ఉండవద్దు. అలా చేసినవారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కోండి. అప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని కనిపించని మీ తండ్రికి తప్ప ఇతరులకు తెలియదు; రహస్యంగా చేసింది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.

పరలోకంలో ధనం

“భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అయితే మీ కోసం పరలోకంలో ధనం కూడపెట్టుకోండి. అక్కడ చెదలు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది.

“కన్ను దేహానికి దీపం. మీ కళ్లు ఆరోగ్యంగా1 ఉంటే మీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. మీ కళ్లు పాడైతే మీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో!

“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.

చింతించకండి

“కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి? అని మీ ప్రాణం గురించి గాని లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికన్నా ఇంకా ఎంతో విలువైన వారు కారా? మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట2 పొడిగించుకోగలరా?

“మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు బట్టలు నేయవు. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! కాబట్టి ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి. దేవుని ఎరుగని ప్రజలు అలాంటి వాటి వెంటపడతారు, కాని అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. రేపటి గురించి చింతించకండి; ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపు చింతింస్తుంది; ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

Source notes (2)
  1. Footnote గ్రీకులో ఆరోగ్యంగా ఇక్కడ ధారాళమైన గుణాన్ని సూచిస్తుంది
  2. Footnote ఒక గంట లేదా మీ ఎత్తులో ఒక అడుగు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.