Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

మత్తయి సువార్త 10

యేసు పన్నెండుమందిని పంపుట

యేసు పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి, అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చారు.

ఆ పన్నెండుమంది అపొస్తలుల పేర్లు:

మొదట పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ,

జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను,

ఫిలిప్పు, బర్తలోమయి,

తోమా, పన్ను వసూలు చేసే మత్తయి,

అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి;

జెలోతే అని పిలువబడిన1 సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

యేసు ఆ పన్నెండు మందికి ఈ సూచనలు ఇచ్చి పంపారు: “యూదేతరుల ప్రాంతాల్లోనికి గాని సమరయ పట్టణాలకు గాని వెళ్లకండి. ఇశ్రాయేలీయులలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు వెళ్లండి. మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం సమీపించింది’ అనే సందేశాన్ని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి.

“మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి. ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటివారికి శుభమని చెప్పండి. ఆ ఇంటికి ఆ యోగ్యత ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీద నిలుస్తుంది. ఆ యోగ్యత ఆ ఇంటికి లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, ఆ ఇంటిని లేదా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాల దుమ్మును దులిపి వెళ్లండి. తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి. మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు. అయితే వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది; ఎందుకంటే, ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు.

“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు. మిమ్మల్ని ఒక గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. మనుష్యకుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నింటికి వెళ్లడం పూర్తి చేయలేరు” అని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.

ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటివారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!

“కాబట్టి వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటి వెలుగులో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పుల నుండి ప్రకటించండి. శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి. రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.

“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. ఎవరు ఇతరుల ముందు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.

“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు. ఎలాగంటే,

“ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు

తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె,

తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.

ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’2

“తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు. తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకుంటారు. నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.

“మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనేవారు నీతిమంతుని ఫలం పొందుతారు. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్లను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”

Source notes (2)
  1. Footnote జెలోతే అంటే మతాభిమాని లేదా అత్యాసక్తి కలవాడు లేదా కనానీయుడైన సీమోను
  2. Footnote మీకా 7:6

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.