Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యోహాను సువార్త 15
యేసు నిజమైన ద్రాక్షావల్లి
“నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు. నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.
“నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు. మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు. మీరు నాలో నిలిచి నా మాటలు మీలో నిలిచి ఉంటే, మీకు ఇష్టమైన దానిని అడగండి, అది మీకు జరుతుంది. మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.
“తండ్రి నన్ను ప్రేమించినట్లే, నేను మిమ్మల్ని ప్రేమించాను. కాబట్టి మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు. అప్పుడు నా సంతోషం మీలో ఉండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, నేను ఈ సంగతులను మీతో చెప్పాను. నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఒకడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టే ప్రేమకంటే గొప్ప ప్రేమ లేదు. నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలుస్తున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నిటిని మీకు తెలియజేశాను. మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకుని మీరు వెళ్లి ఫలించాలని మీ ఫలం నిలిచి ఉండాలని మిమ్మల్ని నియమించాను. కాబట్టి మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను. నా ఆజ్ఞ ఇదే: ఒకరిని ఒకరు ప్రేమించండి.
లోకం శిష్యులను ద్వేషిస్తుంది
“ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే అది మీకంటె ముందుగా నన్ను ద్వేషించిందని మీరు గ్రహించాలి. మీరు ఈ లోకానికి చెందినవారైతే అది మిమ్మల్ని సొంత వారిలా ప్రేమించేది. కానీ మీరు ఈ లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని ఈ లోకం నుండి ప్రత్యేకించాను; అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నేను మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి: ‘ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు.’1 వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా బోధకు లోబడి ఉంటే, వారు మీ బోధకు కూడా లోబడుతారు. నా నామాన్ని బట్టి వారు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారికి నన్ను పంపినవారెవరో తెలియదు అందుకే ఇలా చేస్తారు. నేను వచ్చి వారితో ఈ విషయాలను మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు; కాని ఇప్పుడు వారు పాపం చేయలేదని తప్పించుకునే అవకాశం లేదు. నన్ను ద్వేషించేవారు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. ఎవరూ చేయని ఈ అద్భుత కార్యాలను నేను వారి మధ్యలో చేసి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. అయితే ఇప్పుడు వారు వాటిని చూసి కూడా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. ‘కారణం లేకుండా వారు నన్ను ద్వేషించారు’2 అని ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేరడానికి ఇది జరిగింది.
పరిశుద్ధాత్మ కార్యాలు
“తండ్రి నుండి నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్యమైన ఆత్మ తండ్రి దగ్గరి నుండి వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు. మీరు మొదటి నుండి నాతో ఉన్నవారే, కాబట్టి మీరు కూడ తప్పక నా గురించి సాక్ష్యం ఇవ్వాలి.
Source notes (2)
- Footnote యోహాను 13:16
- Footnote కీర్తన 35:19; 69:4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.