Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యోహాను సువార్త 16
“మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదని నేను మీకు ఈ సంగతులను చెప్పాను. వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు దేవుని కోసం మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది. వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కాబట్టి వారు ఇలాంటి పనులను చేస్తారు. అవి జరిగేటప్పుడు ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్పాను. మొదట్లో ఈ సంగతులను మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. కానీ నేను చెప్పిన ఈ సంగతులను గురించి మీ హృదయాలు దుఖంతో నిండి ఉన్నాయి. అయితే నేను మీతో చెప్పేది నిజం, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకస్తులను తప్పు ఒప్పుకునేలా చేస్తాడు. ప్రజలు నన్ను నమ్మలేదు కాబట్టి వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఇక మీరు నన్ను చూడరు కాబట్టి వారి నీతిని గురించి, ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు కాబట్టి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు.
“మీతో ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు. అయితే సత్యమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను మాట్లాడడు; తాను విన్నవాటినే ఆయన చెప్తాడు, జరుగబోయే వాటిని మీకు చెప్తాడు. ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియచేస్తూ నన్ను మహిమపరుస్తాడు. నా తండ్రికి ఉన్నవన్నీ నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.”
శిష్యుల దుఃఖం సంతోషంగా మారును
యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.”
అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన చెప్తున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కాబట్టి ‘కొద్ది కాలం మీరు నన్ను చూడరు. ఆ తర్వాత కొంతకాలానికి మీరు నన్ను చూస్తారు’ అనే మాటలకు అర్థం ఏమైయుంటుంది?” అని చెప్పుకొన్నారు. వారు, “ ‘ఇంకా కొద్ది సమయం’ అంటే ఆయన అర్థమేంటి? ఆయన ఏమి చెప్తున్నారో మనకు అర్థం కావడం లేదు” అని అనుకున్నారు.
యేసు తన శిష్యులు ఆ విషయం గురించి తనను అడగాలని అనుకుంటున్నారని గ్రహించి వారితో, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, దాని తర్వాత ఇంకొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు” అని నేను చెప్పినదాని గురించి మీరు ఒకరిని ఒకరు అడుగుతున్నారా? నేను మీతో చెప్పేది నిజం, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది. మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు. ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తారని నేను మీతో చెప్పేది నిజం. ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.
“ఇంతవరకు నేను మీతో ఉపమానాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు.
అప్పుడు యేసు శిష్యులు, “ఇప్పుడు నీవు ఉపమానాలతో కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని మేము గ్రహిస్తున్నాము. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
యేసు వారితో, “ఇప్పుడు మీరు నమ్ముతున్నారా?” అన్నారు. “ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు.
“ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.