Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

ప్రసంగి 3

ప్రతి దానికి సమయముంది

ప్రతిదానికీ ఒక సమయం ఉంది,

ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:

పుట్టడానికి సమయం చావడానికి సమయం,

నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం,

చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం,

పడగొట్టడానికి, కట్టడానికి.

ఏడ్వడానికి, నవ్వడానికి

దుఃఖపడడానికి, నాట్యమాడడానికి,

రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి,

కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.

వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం,

దాచిపెట్టడానికి, పారవేయడానికి,

చింపివేయడానికి, కుట్టడానికి,

మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,

ప్రేమించడానికి, ద్వేషించడానికి,

యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.

కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి? మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను. ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు. మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు.

ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే.

ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే.

మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు.

సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను.

న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది.

న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది.

నేనిలా అనుకున్నాను,

“నీతిమంతులకు దుర్మార్గులకు

దేవుడు తీర్పు తీరుస్తారు,

ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది

ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.”

నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు. ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే. అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”

కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.