Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

ద్వితీయో 15

అప్పులను మాఫీ చేసే సంవత్సరం

ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి. రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది. మీరు విదేశీయులను అప్పు చెల్లించమని అడగవచ్చు కాని మీ తోటి ఇశ్రాయేలీయుని ప్రతి అప్పు రద్దు చేయాలి. అయితే, మీ మధ్యలో పేదవారు ఎవరు ఉండకూడదు, ఎందుకంటే మీ స్వాస్థ్యంగా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని అధికంగా దీవిస్తారు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించి మీ దేవుడైన యెహోవాకు మీరు పూర్తిగా లోబడి జీవించాలి. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మిమ్మల్ని దీవిస్తారు. మీరు అనేకమంది ప్రజలకు అప్పు ఇస్తారు కాని అప్పు చేయరు. మీరు అనేక దేశాలను పరిపాలిస్తారు అయితే మిమ్మల్ని ఎవరు పరిపాలించరు.

మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు. కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి. ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు. వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు. దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.

దాసులను విడుదల చేయుట

మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి. మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు. మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి. మీరు ఈజిప్టులో దాసులై ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించారని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను ఈ రోజు మీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను.

కాని ఒకవేళ దాసుడు మీ దగ్గర సంతోషంగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న కారణంగా, “నేను మిమ్మల్ని విడిచి వెళ్లను” అని అంటే, మీరు కదురు తీసుకుని, వాని చెవిని తలుపుకు ఆనించి తలుపు లోనికి దిగేలా కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు మీకు జీవితకాల దాసునిగా ఉంటాడు. మీ దాసికి కూడా అలాగే చేయాలి.

మీ దాసులను స్వేచ్ఛగా పోనివ్వడానికి మీరు కష్టం భావించవద్దు, ఎందుకంటే ఆరు సంవత్సరాలు వారు మీకు చేసిన సేవ మామూలు కూలివారు చేసే దానికన్నా రెట్టింపు ఉంటుంది. మీరు అలా చేస్తే మీ దేవుడైన యెహోవా మీరు చేసేవాటన్నిటిలో మిమ్మల్ని దీవిస్తారు.

మొదట పుట్టిన జంతువులు

పశువుల మందలో మొదట పుట్టిన ప్రతి మగదానిని మీ దేవుడైన యెహోవా కోసం పవిత్రపరచాలి. మీ ఎద్దులలో మొదట పుట్టిన దానితో పని చేయించకూడదు, గొర్రెలలో మొదట పుట్టిన దాని బొచ్చు కత్తిరించకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రతి సంవత్సరం మీరు మీ కుటుంబం వాటిని తినాలి. ఆ జంతువుల్లో లోపం అంటే అది కుంటిదైనా గ్రుడ్డిదైనా లేదా వేరే ఏదైన లోపం ఉంటే మీరు దానిని మీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు. మీరు దానిని మీ సొంత పట్టణాల్లోనే తినాలి. జింకను దుప్పిని తిన్నట్లు ఆచారరీత్య పవిత్రులు, అపవిత్రులు, ఇద్దరు దానిని తినవచ్చు. అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.