Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 సమూయేలు 17

దావీదు గొల్యాతు

ఫిలిష్తీయులు తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చి యూదాలోని శోకోలో సమీకరించి ఎఫెస్-దమ్మీము దగ్గర శోకోకు అజేకాకు మధ్యన శిబిరం ఏర్పరచుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులు కలిసివచ్చి ఏలహు1 లోయలో శిబిరం ఏర్పరచుకొని ఫిలిష్తీయులకు ఎదురుగా పోరాడడానికి యుద్ధవరుసలు ఏర్పరచుకున్నారు. ఫిలిష్తీయులు ఒక కొండను, ఇశ్రాయేలీయులు మరొక కొండను ఆక్రమించుకున్నారు, వాటి మధ్య లోయ ఉంది.

గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.2 అతని తలమీద ఇత్తడి శిరస్త్రాణం ఉంది, అతడు 5,000 షెకెళ్ళ3 బరువుగల ఇత్తడి యుద్ధకవచాన్ని ధరించాడు. అతని కాళ్లకు ఇత్తడి తొడుగు అతని వీపు మీద ఒక ఇత్తడి బల్లెం ఉన్నాయి. అతని ఈటె నేతపనివాని కర్రంత పెద్దది. అతని ఈటె కొనలో ఉన్న ఇనుము బరువు ఆరువందల షెకెళ్ళు.4 అతని డాలు మోసేవాడు అతని ముందు నడుస్తున్నాడు.

గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు. ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు. ఆ ఫిలిష్తీయుని మాటలు విని సౌలు ఇశ్రాయేలీయులందరు చాలా దిగులుపడి భయపడ్డారు.

దావీదు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు. యెష్షయి ముగ్గురు పెద్దకుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. వారిలో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలుతో పాటు వెళ్లారు. అయితే దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపడానికి, అలాగే సౌలు దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు.

ఆ ఫిలిష్తీయుడు నలభైరోజుల వరకు ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి నిలబడేవాడు.

యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, “నీ అన్నల కోసం ఒక ఏఫా5 వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు. అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా. వారు సౌలుతో ఉన్నారు; ఇశ్రాయేలీయులందరు ఏలహు లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు” అని చెప్పి పంపించాడు.

దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకు చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్లాడు. అయితే అతడు యుద్ధభూమి దగ్గరకు వచ్చేసరికి సైన్యమంతా బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధభూమికి వస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాన్లు భద్రపరిచేవానికి అప్పగించి పరుగెత్తి వెళ్లి యుద్ధభూమిలో ఉన్న తన అన్నలను వారి క్షేమం అడిగాడు. అతడు వారితో మాట్లాడుతుండగా గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి రోజు చేసినట్లే ఆ రోజు కూడా సవాలు చేస్తూ ఉండగా దావీదు విన్నాడు. ఇశ్రాయేలీయులందరు అతన్ని చూసి చాలా భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.

ఇశ్రాయేలీయులలో ఒకడు, “వస్తున్న ఆ వ్యక్తిని చూశారా, ఇశ్రాయేలీయులను ఎదిరించడానికే అతడు వస్తున్నాడు. అయితే అతన్ని చంపినవాన్ని రాజు గొప్ప ధనవంతునిగా చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి అతని కుటుంబం ఇశ్రాయేలులో పన్నులు కట్టే అవసరం లేకుండ చేస్తారు” అని చెప్పాడు.

అప్పుడు దావీదు తన దగ్గర నిలబడినవారిని, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు.

అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు.

దావీదు వారితో మాట్లాడిన మాటలు అతని పెద్దన్న ఏలీయాబు విని దావీదు మీద కోప్పడి అతనితో, “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీకు ఎంత అహంకారమో నీది ఎంత చెడ్డ హృదయమో నాకు తెలుసు! యుద్ధం చూడడానికే గదా నీవు వచ్చావు” అన్నాడు.

అందుకు దావీదు, “నేనేమి చేశాను? నేనేమి మాట్లాడకూడదా?” అని అడిగి, అతని దగ్గర నుండి వెళ్లి మరొకరిని మరలా అదే ప్రశ్న అడిగాడు. వారు కూడా అదే జవాబిచ్చారు. దావీదు మాటలు విన్న మరికొందరు వాటిని సౌలుకు చెప్పినప్పుడు అతడు దావీదును పిలిపించాడు.

దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు.

అందుకు సౌలు దావీదుతో, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అని చెప్పాడు.

అందుకు దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే, నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు. దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు” అన్నాడు.

అప్పుడు సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అని దావీదుతో అన్నాడు.

సౌలు తన యుద్ధ వస్త్రాలను, యుద్ధకవచాన్ని దావీదుకు తొడిగించి ఇత్తడి శిరస్త్రాణం అతని తలపై పెట్టాడు. దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు.

అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. అతడు తన చేతికర్రను పట్టుకుని ఏటిలో నుండి అయిదు సన్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న చిన్న సంచిలో వేసుకుని తన వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్లాడు.

తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి, ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు. అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు. ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.

అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా6 పేరట నేను నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది. అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.

ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు. దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.

అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.

అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు.

ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెంటాడడం ఆపి, తిరిగివచ్చి వారి డేరాలను దోచుకున్నారు.

దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు.

దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు.

అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.

అందుకు రాజు, “ఈ యువకుడు ఎవరి కుమారుడో తెలుసుకోండి” అని ఆజ్ఞాపించాడు.

దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు.

సౌలు అతన్ని, “చిన్నవాడా, నీవెవరి కుమారుడవు?” అని అడిగాడు.

అందుకు దావీదు, “నేను నీ సేవకుడు బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను” అని సమాధానమిచ్చాడు.

Source notes (6)
  1. Footnote ఏలహు అంటే సింధూర
  2. Footnote అంటే, సుమారు 9 అడుగుల 9 అంగుళాలు లేదా 3 మీటర్లు
  3. Footnote అంటే, సుమారు 58 కి. గ్రా. లు
  4. Footnote అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు
  5. Footnote అంటే, సుమారు 16 కి. గ్రా. లు
  6. Footnote హెబ్రీలో ఎల్-షద్దాయ్

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.