ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కీర్తన 10
యెహోవా, నువ్వెందుకు దూరంగా నిలిచి ఉంటావు? ఆపద సమయాల్లో నువ్వెందుకు దాగి ఉంటావు?
తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి.
దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు.
దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.
అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు.
నేను ఎన్నడూ ఓడిపోను, తరతరాల వరకూ విరోధాన్ని చూడను, అని అతడు తన మనసులో అనుకుంటాడు.
అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.
గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి.
గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు.
అతని బాధితులు నలిగిపోయి దెబ్బలు తింటారు. వాళ్ళు అతని బలమైన వలల్లో పడిపోతారు.
దేవుడు మరచిపోయాడు, ఆయన తన ముఖం కప్పుకున్నాడు, ఆయనకు చూసే ఉద్దేశం లేదు, అని తన హృదయంలో అనుకుంటాడు.
యెహోవా లేచి రా. దేవా, నీ చెయ్యెత్తి తీర్పు తీర్చు. పీడితులను మరిచిపోవద్దు.
నువ్వు నన్ను బాధ్యుణ్ణి చెయ్యవు అని దేవుణ్ణి తృణీకరిస్తూ దుర్మార్గుడు తన హృదయంలో ఎందుకు అనుకుంటున్నాడు?
నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు.
దుష్టల, దురాత్ముల చెయ్యి విరగగొట్టు. నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవనుకుని అతడు చేస్తూ వచ్చిన చెడుపనులకు అతన్నే బాధ్యుణ్ణి చెయ్యి.
ఎన్నటెన్నటికీ యెహోవాయే రాజు. ఆయన తన భూభాగం నుంచి అన్యజాతులను పారదోలుతాడు.
యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్థన వింటావు.
ఏ మనిషీ మళ్ళీ ఎన్నడూ భయభ్రాంతులు కలగజేయకుండా ఉండేలా తండ్రి లేని వాళ్ళను, పీడితులను నువ్వు రక్షిస్తావు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.