Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

యోబు 31

నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?

అలా చేస్తే పైనున్న దేవుని ఆజ్ఞ ఏమౌతుంది? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని వారసత్వం ఏమౌతుంది?

ఆపద అనేది దుర్మార్గులకేననీ, విపత్తు దుష్టత్వం జరిగించే వారికేననీ నేను భావించే వాణ్ణి.

ఆయనకు నా ప్రవర్తన తెలుసు గదా. ఆయన నా అడుగు జాడలన్నిటినీ లెక్కబెడతాడు గదా.

అబద్ధికుడినై నేను తిరుగులాడి ఉన్నట్టయితే, మోసం చేయడానికి నా కాలు వేగిరపడినట్టయితే,

నా యథార్థతను తెలుసుకునేందుకు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచు గాక.

నేను న్యాయ మార్గం విడిచి నడచినట్టయితే, నా మనస్సు నా కళ్ళను అనుసరించి నడిచినట్టయితే మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలినట్టయితే,

నేను విత్తనం చల్లి పండించిన దాన్ని వేరొకడు భుజించనియ్యండి. నా పంటను పెరికి వేయనియ్యండి.

నేను హృదయంలో పరస్త్రీని మోహించినట్టయితే, నా పొరుగువాడి వాకిట్లో అతని భార్య కోసం నేను పొంచి ఉన్నట్టయితే,

నా భార్య వేరొకడి తిరుగలి విసరు గాక. ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక.

అది భయంకరమైన నేరం. అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరం.

అది నాశనకూపం వరకూ దహించే అగ్నిహోత్రం. అది నా పంట కోత అంతటినీ నిర్మూలం చేస్తుంది.

నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యెమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే,

దేవుడు లేచి నాపై తప్పు మోపినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణకై వచ్చినప్పుడు నేను ఆయనకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను?

గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించ లేదా? గర్భంలో నన్నూ వారినీ కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా.

పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే,

తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనా తిననియ్యక నేనొక్కడినే భోజనం చేస్తే,

(నేను అలా చేయలేదు, నా యవ్వనప్రాయం మొదలు తండ్రి లేనివాడు నన్నొక తండ్రిగా భావించి నా దగ్గర పెరిగాడు. నా తల్లి కడుపున పుట్టింది మొదలు నేను అతని తల్లికి, ఆ వితంతువుకు దారి చూపించాను).

ఎవరైనా బట్టల్లేక చావడం నేను చూస్తే, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూస్తే,

వారి హృదయాలు నన్ను దీవించక పోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందక పోయినట్టయితే,

ఊరి రచ్చబండ దగ్గర అంతా నన్ను సమర్థిస్తారులే అని తండ్రిలేని వారి పై నేను చెయ్యి ఎత్తితే,

నా భుజం ఎముక దాని గూటి నుండి జారిపోతుంది గాక. నా చేతి ఎముక దాని కీలు దగ్గర విరిగిపోతుంది గాక.

దేవుడి నుండి ఆపద వస్తుందని నాకొక భయం ఉంది. ఆయన మహాత్మ్యం కారణంగా ఇలాంటివేమీ నేను చెయ్యలేదు.

బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే,

నాకు చాలా ఆస్తి ఉందని గానీ నా చేతికి విస్తారమైన సంపద దొరికిందని గానీ నేను సంతోషించినట్టయితే,

సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గానీ, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గానీ చూసి,

నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే,

అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమౌతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్న వాడినౌతాను.

నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే,

(పాపం చేయడానికి నేను నా నోటికి చోటియ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు).

“యోబు పెట్టిన భోజనం తిని, తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు?” అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే,

(పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి).

మానవ జాతి చేసినట్టు నా పాపాలను దాచి పెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు.

జన సమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు.

నా మాట వినడానికి నాకొకడు ఉంటే ఎంత బాగుంటుంది! ఇదిగో నా సంతకం. సర్వశక్తుడు నాకు జవాబిస్తాడు గాక. ఇదిగో నా ప్రతివాది రాసిన అభియోగం ఎవరైనా నాకు చూపిస్తే ఎంత బాగుంటుంది!

నిశ్చయంగా నేను నా భుజం మీద దాన్ని ధరిస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకుంటాను.

నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజు లాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను.

నా భూమి నా గురించి మొర పెడితే, దాని చాళ్లు ఏకమై ఏడిస్తే,

వెల చెల్లించకుండా నేను దాని పంటను అనుభవించినట్టయితే, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసినట్టయితే,

గోదుమల బదులు ముళ్లు, బార్లీకి బదులు కలుపు మొలచు గాక.

యోబు మాటలు ఇంతటితో సమాప్తం.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.