ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యోబు 30
ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు. వీరి తండ్రులు నా మందలు కాసే కుక్కలతో ఉండడానికి తగని వారని నేను తలంచాను.
వారి తండ్రుల చేతుల బలం నాకేమి ప్రయోజనం? వారి వయసు మళ్ళిపోవడం చేత వారి సత్తువతగ్గిపోయింది.
వారు పేదరికం చేత, కరువుచేత, శుష్కించిపోయిన వారు. పాడై నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలోని చీకటి తావుల్లో ఎండిన నేలలో వెదుకులాడుతారు.
వారు తుప్పల్లోని రేవు కాడలను పెరుకుతారు. దూసరి తీగె వారికి ఆహారం.
వారు మనుషుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముతూ కేకలు వేసినట్టు మనుషులు వారిని తరుముతూ కేకలు వేస్తారు.
భయంకరమైన లోయల్లో, నేల నెర్రెల్లో బండల సందుల్లో వారు కాపురముండవలసి వచ్చింది.
తుప్పల్లో వారు గాడిదల్లాగా ఓండ్ర పెడతారు ముళ్లచెట్ల కింద వారు కూర్చుంటారు.
వారు మోటు వారికి, పేరు లేని పనికి మాలిన వారికి పుట్టినవారు. దేశంలోనుండి కొరడాలతో వారిని తరిమి వేశారు.
అలాంటివారి కొడుకులు ఇప్పుడు నా గురించి పాటలు పాడుతారు. నేను వారి వేళాకోళానికి గురి అవుతున్నాను.
వారు నన్ను అసహ్యించుకుంటారు. నా దగ్గర నుండి దూరంగా పోతారు. నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు.
ఆయన నా అల్లె తాడు తప్పించి నన్ను బాధించాడు. కాబట్టి వారు నాకు లోబడక నా అదుపు తప్పి పోయారు.
నా కుడిపక్కన అల్లరిమూక లేస్తుంది. వారు నన్ను తరుముతారు. నాకు ఎదురుగా ముట్టడి దిబ్బ వేస్తారు.
వారిని అదుపు చేసే వారు లేరు. నా దారిని పాడు చేస్తారు. నా మీదికి ఆపద లాక్కొస్తారు.
గొప్ప గండి పడి జలప్రవాహం వచ్చినట్టు వారు వస్తారు. ఆ వినాశంలో వారు కొట్టుకుపోతారు.
భీతి నాపై దాడి చేసింది. గాలికి కొట్టుకుపోయినట్టు నా గౌరవం ఎగిరిపోయింది. మేఘం లాగా నా అభివృద్ధి కదిలి వెళ్లి పోయింది.
నా ప్రాణం నాలోనుంచి పార బోసినట్టు అయిపోయింది. కష్టకాలం నన్ను చేజిక్కించుకుంది.
రాత్రివేళ నా ఎముకలు నాలో విరుగ్గొట్టినట్టు అయిపోయింది. నన్ను వేధించే నొప్పులు ఆగడం లేదు.
దేవుని మహా బలం నా వస్త్రాన్ని ఒడిసి పట్టింది. మెడ చుట్టూ ఉండే నా చొక్కాలాగా అది బిగుసుకు పోతున్నది.
ఆయన నన్ను బురదలోకి తోసాడు. నేను దుమ్ములాగా బూడిదలాగా ఉన్నాను.
ఓ దేవా నీకు మొర పెడుతున్నాను. అయితే నువ్వు జవాబియ్యడం లేదు. నేను నిలబడితే నువ్వు అలా చూస్తూ ఉన్నావు.
నువ్వు మారిపోయావు. నా పట్ల కఠినుడివైపోయావు. నీ బాహుబలంతో నన్ను హింసిస్తున్నావు.
గాలితో నన్ను ఎగరగొట్టి కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫానుతో నానిపోయేలా చేస్తున్నావు.
నన్ను మరణానికి, అంటే జీవులందరికీ నియమించిన నివాసానికి రప్పిస్తావని నాకు తెలుసు.
ఎవరైనా పడిపోతూ ఉన్నప్పుడు సహాయం కోసం చెయ్యి చాపడా? ఆపదలో రక్షించమని మొర పెట్టడా?
బాధలో ఉన్న వారి కోసం నేను ఏడవ లేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఖించ లేదా?
నాకు మేలు కలుగుతుందని నేను ఆశించాను. కానీ నాకు కీడు సంభవించింది. వెలుగు కోసం నేను కనిపెట్టగా చీకటి దక్కింది.
నా పేగులు మానక మండుతున్నాయి అపాయ దినాలు నన్నెదుర్కొన్నాయి.
సూర్య కాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను.
నేను నక్కలకు అన్ననయ్యాను. నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను.
నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోతున్నది. వేడిమి వలన నా ఎముకలు కాగిపోయాయి.
నా స్వరమండలం శోక గీతం వినిపిస్తున్నది. నా వేణువు రోదనశబ్దం ఆలపిస్తున్నది.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.