Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

జెకర్యా 8

యెరూషలేమును ఆశీర్వదిస్తానని యెహోవా వాగ్దానం

సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చింది.

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోను గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను; ఆమె పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహించివేస్తుంది.”

యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోనుకు తిరిగివచ్చి యెరూషలేములో నివసిస్తాను. అప్పుడు యెరూషలేము నమ్మకమైన పట్టణమని, సైన్యాల యెహోవా పర్వతమని, పవిత్ర పర్వతమని పిలువబడుతుంది.”

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మరోసారి వృద్ధులైన స్త్రీ పురుషులు తమ చేతికర్ర పట్టుకొని ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు. పట్టణ వీధులు ఆటలాడే అబ్బాయిలతో అమ్మాయిలతో నిండిపోతాయి.”

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ సమయంలో ఈ ప్రజల్లో మిగిలిన ఉన్నవారికి ఇది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు కాని నాకు ఆశ్చర్యంగా ఉంటుందా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను తూర్పు, పడమర దేశాల నుండి నా ప్రజలను రక్షిస్తాను. యెరూషలేములో నివసించేందుకు వారిని తిరిగి తీసుకువస్తాను; వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవునిగా నమ్మకంగా నీతితో ఉంటాను.”

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే. అంతకుముందు మనుష్యులకు జీతం గాని, పశువులకు బాడిగ గాని దొరకలేదు. నేను ఒకరిపై ఒకరికి వ్యతిరేకత కలిగించాను కాబట్టి ఎవరూ క్షేమంగా తమ పనిని చేయలేకపోయారు. అయితే పూర్వకాలంలో నేను చేసినట్లుగా ఇప్పుడు మిగిలి ఉన్నవారిపట్ల చేయను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

“సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను. యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మీ పూర్వికులు నాకు కోపం పుట్టించినప్పుడు దయ చూపించకుండ నేను మీకు కీడు చేయాలని అనుకున్నట్టే” అని సైన్యాల యెహోవా అంటున్నారు, “ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి. మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి; ఒకరిపై ఒకరు కుట్ర చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడవద్దు. ఇవన్నీ నేను ద్వేషిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది.

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “అనేకమంది ప్రజలు ఎన్నో పట్టణాల నివాసులు ఇంకా వస్తారు, ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు. అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.”

సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.