Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

పరమ 8

ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే,

నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే!

అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే,

నిన్ను ముద్దాడేదాన్ని,

నన్ను ఎవరూ నిందించేవారు కారు.

నేను నిన్ను తోలుకొని

నాకు ఉపదేశం చేసిన,

నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని.

నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని,

దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.

ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు,

కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.

యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను:

సరియైన సమయం వచ్చేవరకు

ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.

చెలికత్తెలు

తన ప్రియుని ఆనుకుని

అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు?

యువకుడు

ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను;

అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది,

అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.

నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా,

మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో;

ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది,

దాని అసూయ సమాధిలా క్రూరమైనది.

ఇది మండుతున్న అగ్నిలా,

శక్తివంతమైన మంటలా1 కాలుతుంది.

పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు;

నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు.

ప్రేమకు ప్రతిగా

తనకున్నదంతా ఇచ్చినా,

దానికి2 తిరస్కారమే లభిస్తుంది.

చెలికత్తెలు

మాకో చిన్న చెల్లెలుంది,

దానికింకా స్తనములు రాలేదు.

దానికి పెళ్ళి నిశ్చయమైతే

ఏం చేయాలి?

ఒకవేళ ఆమె ప్రాకారమైతే,

ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము.

ఒకవేళ ఆమె ద్వారం అయితే,

దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము.

యువతి

నేను ప్రాకారాన్ని,

నా స్తనములు గోపురాల్లాంటివి.

అందుకే అతని దృష్టికి

క్షేమం పొందదగినదానిగా ఉన్నాను.

బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది;

అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు.

దాని ఫలానికి ఒక్కొక్కడు

వెయ్యి వెండి షెకెళ్ళ3 శిస్తు చెల్లించాలి.

కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది;

సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి.

వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు4 గిట్టుతాయి.

యువకుడు

ఉద్యానవనాల్లో నివసించేదానా

నీ చెలికత్తెలు నీతో ఉండగా,

నీ స్వరం విననివ్వు.

యువతి

నా ప్రియుడా, దూరంగా రా,

జింకలా, దుప్పిలా

పరిమళముల పర్వతాల మీదుగా

గంతులు వేస్తూ రా.

Source notes (4)
  1. Footnote లేదా యెహోవా యొక్క మంటలా
  2. Footnote లేదా అతడు
  3. Footnote అది సుమారు 12 కి. గ్రా. లు; పరమ 8:12 కూడా
  4. Footnote అంటే, సుమారు 2.3 కి. గ్రా. లు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.