Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 95
రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం;
రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.
కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం,
సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.
యెహోవా గొప్ప దేవుడు,
దైవములందరి పైన గొప్ప రాజు.
భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి,
పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.
సముద్రం ఆయనదే, ఆయనే దాన్ని చేశారు,
ఆయన హస్తాలు ఆరిన నేలను రూపొందించాయి.
రండి, సాగిలపడి ఆరాధించుదాం,
మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;
ఎందుకంటే ఆయన మన దేవుడు
మనం ఆయన పచ్చికలోని ప్రజలం,
ఆయన శ్రద్ధచూపే మంద.
నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,
“మీరు మెరీబా1 దగ్గర చేసినట్టుగా,
అరణ్యంలో మస్సా2 దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.
అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు;
నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.
నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను:
‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు,
వారు నా మార్గాలను తెలుసుకోలేదు’
కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’
అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”
Source notes (2)
- Footnote మెరీబా అంటే గొడవపడుట.
- Footnote మస్సా అంటే పరీక్షించుట
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.