Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 64
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
నా దేవా, నా ఫిర్యాదు వినండి;
శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.
దుష్టుల కుట్ర నుండి,
కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.
వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు
మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.
చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు.
వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.
కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు.
వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు;
వారంటారు, “దీన్ని1 ఎవరు చూస్తారు?”
వారు అన్యాయాలను రూపొందించి అంటారు,
“మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!”
నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.
కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు;
వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.
ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి
వారిని పతనానికి తెస్తారు;
వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.
మనుష్యులందరు భయపడతారు;
దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు
ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.
నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక.
ఆయననే ఆశ్రయించెదరు గాక.
యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!
Source notes (1)
- Footnote లేదా మనల్ని
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.