Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 43
నా దేవా, నాకు న్యాయం తీర్చండి,
భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా
నా పక్షంగా వాదించి,
మోసగాళ్ల నుండి దుష్టుల నుండి
నన్ను విడిపించండి.
మీరే దేవుడు, నా బలమైన కోట.
నన్నెందుకు ఇలా తిరస్కరించారు?
శత్రువులచేత అణచివేయబడుతూ
నేనెందుకు దుఃఖంతో గడపాలి?
మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి;
అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి
మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.
అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను,
నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను.
దేవా! నా దేవా!
వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?
దేవుని మీద నిరీక్షణ ఉంచు,
ఆయనే నా రక్షకుడు నా దేవుడు
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.