Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 18

సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;

నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ,

నా డాలు1 నా రక్షణ కొమ్ము2, నా బలమైన కోట.

స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను,

నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.

మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి;

దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు.

సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి;

మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.

నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను;

సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను.

తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు;

నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.

భూమి కంపించి అదిరింది,

పర్వతాల పునాదులు కదిలాయి;

ఆయన కోపానికి అవి వణికాయి.

ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది;

ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది,

దానిలో నిప్పులు మండుతున్నాయి.

ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు;

ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.

ఆయన కెరూబుల3 మీద ఎక్కి వచ్చారు;

ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.

ఆయన చీకటిని తన కప్పుగా,

కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు.

ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు,

వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి.

యెహోవా పరలోకం నుండి ఉరిమారు;

మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.4

ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు,

మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.

యెహోవా, మీ గద్దింపుకు,

మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి,

సముద్రపు అగాధాలు కనబడ్డాయి

భూమి పునాదులు బయటపడ్డాయి.

ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు;

లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.

శక్తివంతమైన నా శత్రువు నుండి,

నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.

నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు,

కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.

ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు;

ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.

నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు;

నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.

నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను;

దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.

ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి;

ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.

ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను,

నేను పాపానికి దూరంగా ఉన్నాను.

నా నీతిని బట్టి, ఆయన దృష్టిలో నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి,

యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.

నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు.

యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,

నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు,

కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.

మీరు దీనులను రక్షిస్తారు

కాని అహంకారులను అణిచివేస్తారు.

యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే;

నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.

మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను;

నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.

దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది;

యెహోవా వాక్కు లోపం లేనిది;

ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.

యెహోవా తప్ప దేవుడెవరు?

మన దేవుని మించిన కొండ5 ఎవరు?

బలంతో నన్ను సాయుధునిగా చేసేది,

నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.

నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు;

ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.

నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు;

నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.

మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు,

మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది;

మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.

నా చీలమండలాలు జారిపోకుండ

మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.

నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను;

వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.

వారు మళ్ళీ లేవకుండా వారిని నలుగగొట్టాను;

వారు నా పాదాల క్రింద పడ్డారు.

మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు;

మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.

మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు,

నేను నా విరోధులను నాశనం చేశాను.

వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు

యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.

గాలికి కొట్టుకుపోయే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను;

వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను6

ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు;

జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు.

నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.

విదేశీయులు నా ముందు భయపడుతున్నారు;

నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.

వారందరి గుండె జారిపోతుంది;

వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.

యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి!

నా రక్షకుడైన దేవునికి మహిమ!

నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే,

దేశాలను నాకు లోబరచేది ఆయనే.

నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే.

నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు;

హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.

అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను;

మీ నామ సంకీర్తన చేస్తాను.

ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు;

ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి,

తన మారని ప్రేమను చూపిస్తారు.

Source notes (6)
  1. Footnote లేదా అధిపతి
  2. Footnote కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది
  3. Footnote కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.
  4. Footnote కొ. ప్రా.ప్ర. లలో ఇది వాడబడలేదు. 2 సమూ 22:14 చూడండి.
  5. Footnote కొండ ఇక్కడ కాపాడేవాడు అని అర్థం
  6. Footnote చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో బయట పారబోశాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.