Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 141
దావీదు కీర్తన.
యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను,
నా దగ్గరకు త్వరగా రండి;
నా స్వరాన్ని ఆలకించండి.
నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక;
నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.
యెహోవా నా నోటికి కావలి పెట్టండి;
నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
కీడు చేసేవారితో కలిసి
వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు,
నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి;
వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!
నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే;
వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే.
నా తల దానిని నిరాకరించదు,
కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.
వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు,
అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.
“ఒకరు భూమిలో దున్నినట్లు,
మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు.
ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను;
మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.
కీడుచేసేవారి ఉచ్చుల నుండి,
వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.
దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు,
నేనైతే తప్పించుకు వెళ్తాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.