Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 115
మాకు కాదు, యెహోవా, మాకు కాదు,
మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి,
మీ నామానికే మహిమ కలగాలి.
“వారి దేవుడు ఎక్కడ?”
అని జనులు ఎందుకు అంటున్నారు?
మన దేవుడు పరలోకంలో ఉన్నారు;
ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.
అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు,
అవి మనుష్యుల చేతిపనులు.
వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు,
కళ్లున్నాయి, కాని చూడలేవు.
వాటికి చెవులున్నాయి, కాని వినలేవు,
ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.
వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు,
పాదాలున్నాయి, కాని నడవలేవు,
కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు.
వాటిని తయారుచేసేవారు,
వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.
సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి
ఆయనే వారికి సహాయం డాలు.
అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి
ఆయనే వారికి సహాయం డాలు.
యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి
ఆయనే వారికి సహాయం డాలు.
యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు:
ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు,
అహరోను వంశాన్ని దీవిస్తారు.
యెహోవాకు భయపడేవారిని అనగా
పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.
యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను,
వృద్ధి చేయును గాక.
ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత,
మీరు దీవించబడుదురు గాక.
ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి,
అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.
యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు,
నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;
మనమే యెహోవాను కీర్తించేవారం,
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము.
యెహోవాను స్తుతించండి.1
Source notes (1)
- Footnote హెబ్రీలో హల్లెలూయా
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.