Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 102

దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర.

యెహోవా, నా ప్రార్థన వినండి;

సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.

నేను కష్టంలో ఉన్నప్పుడు

మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి.

మీ చెవి నా వైపు త్రిప్పండి;

నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.

నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి;

నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి.

దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం;

నేను భోజనం చేయడం మరచిపోతున్నాను.

నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు

నేను అస్థిపంజరంలా ఉన్నాను.

నేను ఎడారి గుడ్లగూబలా,

శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.

నేను మేల్కొని ఉన్నాను;

ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను.

రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు;

నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.

నేను బూడిదను ఆహారంగా తింటున్నాను

పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను.

మీ ఉగ్రతను బట్టి;

మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు.

నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి;

నేను గడ్డిలా వాడిపోతున్నాను.

కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు;

మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.

మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు,

ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది;

నిర్ణీత సమయం వచ్చింది.

దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి;

దుమ్ము వారికి దయ కలిగించింది.

జనులు యెహోవా నామానికి భయపడతారు,

భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.

ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి

తన మహిమతో ప్రత్యక్షమవుతారు.

దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు;

ఆయన వారి మనవులను త్రోసివేయరు.

ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక,

ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక:

“బందీల మూలుగులు వినడానికి

మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి,

యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు,

పరలోకంలో నుండి భూమిని చూశారు.”

ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు

యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో

అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది

యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.

నా జీవిత గమనంలో1 నా బలాన్ని కృంగదీశారు;

ఆయన నా రోజుల్ని తగ్గించారు.

అందుకు నేనన్నాను:

నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి;

మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.

ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు,

ఆకాశాలు మీ చేతి పని.

అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు;

ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.

మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు

అవి అంతరిస్తాయి.

కాని మీరు అలాగే ఉంటారు,

మీ సంవత్సరాలకు అంతం ఉండదు.

మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు;

వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.

Source notes (1)
  1. Footnote లేదా తన శక్తిచేత

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.