Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

సామెతలు 4

ఎలాగైనా జ్ఞానం సంపాదించండి

నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి;

వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.

మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను,

కాబట్టి నా బోధను త్రోసివేయకండి.

నేను కూడా నా తండ్రికి కుమారుడను,

నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.

నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే,

“నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో;

నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.

జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో;

నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.

నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది;

నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.

జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో.

నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.

దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది;

దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది.

అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది

అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.”

నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు,

నీవు దీర్ఘకాలం జీవిస్తావు.

నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను

తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను.

నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు.

నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు.

ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు;

అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.

దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు

కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.

దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు;

దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.

కీడు చేయనిదే వారు నిద్రపోలేరు;

ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.

వారు దుర్మార్గమనే ఆహారం తింటారు

హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు.

నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా,

పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది.

కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం;

వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు.

నా కుమారుడా! నా మాటలు ఆలకించు;

నా వాక్యాలకు నీ చెవియొగ్గు.

నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు,

నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో.

వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని,

వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో,

ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.

నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో;

మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.

నీ కళ్లు నేరుగా చూచును గాక;

నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.

నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో

నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.

నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు.

నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.