Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

సామెతలు 20

మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు;

వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.

రాజు వలన కలుగు భయము సింహగర్జన వంటిది;

రాజునకు కోపం పుట్టించు వారు తమకు ప్రాణహాని తెచ్చుకుంటారు.

తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత,

మూర్ఖులు జగడాన్నే కోరును.

విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు;

కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.

మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది,

వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.

తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు,

కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?

నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు;

వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.

న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు,

తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు.

“నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను;

పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?

తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు,

ఈ రెండును యెహోవాకు అసహ్యం.

చిన్న పిల్లలు తమ ప్రవర్తన స్వచ్ఛమైనదో కాదో యథార్థమైనదో కాదో

తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు.

వినుటకు చెవి చూచుటకు కన్ను

ఈ రెండును యెహోవా కలుగజేసినవే.

నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు;

నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.

కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు

కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు.

బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి,

కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం.

అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి;

ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.

మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు తీపిగా ఉంటుంది.

తర్వాత వాని నోరు మట్టితో నింపబడుతుంది.

ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి,

మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.

పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు

కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.

తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని

దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.

జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం

అంతంలో దీవించబడదు.

కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు,

యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.

మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం,

దొంగత్రాసు ఆయనకు అయిష్టం.

ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా,

అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?

మనుష్యులు తొందరపడి దేవునికి మ్రొక్కుబడి చేయడం ఒక ఉచ్చులాంటిది,

తర్వాత తెలుస్తుంది దాని మూల్యం ఎంత అనేది.

జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు

అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం

అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.

దయ, సత్యాలు రాజును కాపాడతాయి

దయ వలన అతడు తన సింహాసనాన్ని నిలుపుకుంటాడు.

బలము యవ్వనస్థుల కీర్తి

నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.

బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి

చెడుతనాన్ని తొలగిస్తాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.