Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

సామెతలు 17

తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే,

సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు.

వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు

కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.

వెండికి మూస బంగారానికి కొలిమి తగినది,

అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు.

చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును,

అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు.

పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు,

ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు.

పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం,

తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.

అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు,

అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!

లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది,

ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.

ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు,

జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.

బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే,

వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది.

ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును,

అట్టివాని వెంట దయలేని దూత పంపబడును.

మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే

పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.

మేలుకు బదులుగా కీడు చేయువాని

ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు.

గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది;

కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.

దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం,

రెండు యెహోవాకు అసహ్యమే.

బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు,

వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి?

నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు,

ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.

బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు

పొరుగువానికి హామీగా ఉంటాడు.

తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు,

తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.

అసూయగలవాడు మేలుపొందడు

తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును.

మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది,

బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు.

సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం,

నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.

న్యాయం తప్పుదారి పట్టించడానికి

దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.

వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు,

కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి.

బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు,

తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు.

అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే,

నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.

తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు,

శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు.

ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును,

తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.