Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

ఫిలిప్పీ పత్రిక 1

క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి,

క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పరిశుద్ధులకు, సంఘ అధ్యక్షులకు, సంఘ1 పరిచారకులకు వ్రాయుట:

మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.

కృతజ్ఞత చెల్లించుట, ప్రార్థించుట

మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను. మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి, మీలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను.

నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే. యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.

దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.

పౌలు సంకెళ్ళు సువార్తను విస్తరించుట

సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది. నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.

కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు. నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు. అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను.

ఇకముందు కూడా నేను సంతోషిస్తాను. ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను. నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు! ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది. అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు. ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది.

సువార్తకు తగిన జీవితము

ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేదా నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కోసం మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన. మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది, నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది.

Source notes (1)
  1. Footnote రోమా 16:1; 1 తిమోతి 3:8,12

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.