Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
సంఖ్యా 29
బూరల పండుగ
“ ‘ఏడవ నెల మొదటి రోజు పరిశుద్ధ సభను ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. ఆ రోజు మీరు బూరల ధ్వని చేసే రోజు. యెహోవాకు ఇష్టమైన సువాసనగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను దహనబలిగా అర్పించాలి. కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల1 నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు2; ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు3 నాణ్యమైన పిండి అర్పించాలి. అంతేకాక మీకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారబలిగా మేకపోతును కూడా అర్పించాలి. ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి.
ప్రాయశ్చిత్త దినం
“ ‘ఏడవ నెల పదవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి. మీరు ఉపవాసముండాలి ఏ పని చేయకూడదు. యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెతో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు; ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి. అంతేకాక ప్రాయశ్చిత్తం కొరకైన పాపపరిహారబలి, క్రమంగా అర్పించే దహనబలి, భోజనార్పణ, వారి పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
గుడారాల పండుగ
“ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి. యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి. పదమూడు కోడెల్లో ప్రతి దానితో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల పిండి తేవాలి; రెండు పొట్టేళ్లలో ఒక్కో దానితో రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి; పద్నాలుగు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి. అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘రెండవ రోజున లోపం లేని పన్నెండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘మూడవ రోజు లోపం లేని పదకొండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘నాలుగవ రోజున లోపం లేని పది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘అయిదవ రోజు లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘ఆరవరోజు లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘ఏడవ రోజున లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘ఎనిమిదవ రోజున ప్రత్యేక సభగా కూడుకోవాలి, పని ఏదీ చేయకూడదు. యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి. కోడె, పొట్టేలు గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
“ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ”
యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు.
Source notes (3)
- Footnote అంటే సుమారు 5 కి. గ్రా. లు; 9 , 14 వచనాల్లో కూడా
- Footnote అంటే సుమారు 3.2 కి. గ్రా. లు
- Footnote అంటే సుమారు 1.6 కి. గ్రా. లు; 10 , 15 వచనాల్లో కూడా
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.