Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నెహెమ్యా 4
పునర్నిర్మాణానికి వ్యతిరేకత
మేము గోడ తిరిగి కడుతున్నామని విన్న సన్బల్లటు తీవ్రమైన కోపంతో ఊగిపోతూ యూదులను అవహేళన చేస్తూ, తన స్నేహితుల ఎదుట సమరయ సైనికుల ఎదుట మాట్లాడుతూ, “ఈ బలహీనమైన యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని చేయగలరా? వారే బలి అర్పిస్తారా? ఒక రోజులోనే పనంతా చేసేస్తారా? కాలిపోయి చెత్తకుప్పగా పడి ఉన్న రాళ్లతో మళ్ళీ కడతారా?” అన్నాడు.
అతని ప్రక్కన నిలబడి ఉన్న అమ్మోనీయుడైన టోబీయా, “వారు కట్టిన గోడ మీదికి నక్క ఎక్కితే అది కూలిపోతుంది” అన్నాడు.
మా దేవా! ప్రార్థన వినండి, మేము తిరస్కరించబడిన వారము. వారి నిందలు వారి తలల మీదికే త్రిప్పండి. వారే పరాయి దేశానికి బందీలుగా పోవాలి! వారు కడుతున్నవారిని అడ్డుకుని నీకు కోపం పుట్టించారు కాబట్టి వారి దోషాలను కప్పివేయకండి వారి పాపాలను తుడిచివేయకండి.
ప్రజలు హృదయపూర్వకంగా పనిచేశారు కాబట్టి సగం ఎత్తు వరకు గోడలు కట్టగలిగాము.
సన్బల్లటు, టోబీయా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము గోడలు బాగుచేసే పని కొనసాగుతుందని, బీటలన్నిటిని మూసివేస్తున్నారని విన్నప్పుడు వారు చాలా కోప్పడ్డారు. యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు. అయితే మేము మా దేవునికి ప్రార్థించి వారి నుండి కాపాడుకోడానికి రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము.
అప్పుడు యూదా వారు, “పనివారి బలం తగ్గిపోతుంది. చెత్త చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక మేము గోడ కట్టలేం” అన్నారు.
మా శత్రువులు, “వారికి తెలిసేలోపు మనలను చూడకముందే, మనం వారి మధ్యకు వెళ్లి వారిని చంపి పని ఆపివేద్దాం” అని ఆలోచన చేశారు.
మా శత్రువులకు దగ్గరలో నివసించే యూదులు వచ్చి, “మీరు ఎటు తిరిగినా వారు మాపై దాడి చేస్తారు” అని పది కన్న ఎక్కువసార్లు చెప్పారు.
అందువల్ల గోడ వెనుక దిగువ ప్రాంతాల్లో పైనున్న స్థలాల్లో కుటుంబాల ప్రకారం వారికి కత్తులు ఈటెలు విల్లులు ఇచ్చి కాపలా కాయడానికి నియమించాను. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నేను లేచి సంస్థానాధిపతులతో, అధికారులతో మిగిలిన ప్రజలందరితో, “మీరు భయపడకండి. గొప్పవాడు, అద్భుతమైన వాడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాల కోసం మీ కుమారులు కుమార్తెల కోసం, మీ భార్యల కోసం మీ ఇళ్ళ కోసం పోరాడండి” అని చెప్పాను.
తమ కుట్ర గురించి మాకు తెలిసిందని దేవుడు వారి కుట్ర భంగం చేశారని మా శత్రువులు వినగానే, మాలో ప్రతి ఒక్కరు తమ పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు.
ఆ రోజు నుండి నా పనివారిలో సగం మంది పని చేస్తుండగా మిగతా సగం మంది ఈటెలు డాళ్లు విండ్లు కవచాలు ధరించి వచ్చారు. గోడ కట్టే యూదా కుటుంబాలన్నిటి వెనుక అధికారులు నిలబడి ఉన్నారు. బరువులు మోసేవారు ఒక చేతితో తమ పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నారు. కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు.
అప్పుడు నేను సంస్థానాధిపతులతో, అధికారులతో, మిగిలిన వారితో, “మనం చేస్తున్న పని చాలా విస్తారమైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం చాలా దూరంగా ఉన్నాము. కాబట్టి మీకు ఎక్కడ నుండి బూరధ్వని వినబడుతుందో అక్కడికి మీరందరు వచ్చి మాతో కలవాలి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు” అన్నాను.
ఆ విధంగా మేము పని చేశాము; మాలో సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకుని నిలబడ్డారు. ఆ సమయంలో నేను ప్రజలతో, “ప్రతి వ్యక్తి తన పనివారితో కలసి రాత్రివేళ యెరూషలేములోనే ఉండాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపలాగా ఉంటారు, పగలు పని చేస్తారు” అని చెప్పాను. ఈ విధంగా నేను గాని నా బంధువులు గాని నా సేవకులు గాని, నా వెంట ఉన్న కావలివారు గాని బట్టలు విప్పలేదు. నీరు త్రాగడానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.