Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

లూకా సువార్త 11

ప్రార్థనను గురించి బోధించిన యేసు

ఒక రోజు యేసు ఒక స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకు నేర్పించు” అని ఆయనను అడిగాడు.

ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు:

“ ‘తండ్రీ,1

మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

మీ రాజ్యం వచ్చును గాక.2

మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.

మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు,3

మా పాపాలను క్షమించండి.

మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’4”

ఆ తర్వాత యేసు వారితో, “మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి, నీవు అర్థరాత్రి సమయంలో అతని దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా, నా స్నేహితుడొకడు ప్రయాణం చేస్తూ, నా దగ్గరకు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఆహారమేమి లేదు కాబట్టి నాకు మూడు రొట్టెలిస్తావా?’ అని అడిగితే; లోపల ఉన్నవాడు, ‘నన్ను ఇబ్బంది పెట్టకు, తలుపుకు తాళం వేసి ఉంది. నేను నా పిల్లలు పడుకున్నాము. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను?’ అని అన్నాడనుకోండి. నేను చెప్తున్న, మీకున్న స్నేహాన్ని బట్టి అతడు లేచి నీకు రొట్టె ఇవ్వకపోయినా, నీవు అంతగా సిగ్గువిడిచి అడిగావు కాబట్టి5 అతడు తప్పక లేచి, నీకు అవసరమైనంత ఇస్తాడు.

“అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.

“మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప6 అడిగితే పాము ఇస్తారా? వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా? మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”

యేసు బయల్జెబూలు

ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు. అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు.

యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు: “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది, ఒక కుటుంబం దానికదే వ్యతిరేకించి చీలిపోతే అది కూలిపోతుంది. ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్న ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు కాబట్టి. ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు. కానీ ఒకవేళ నేను దేవుని అధికారంతో దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.

“బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది. అయితే అతనికంటే బలవంతుడు వానిని ఓడించినప్పుడు, వాడు నమ్మకముంచిన ఆ ఆయుధాలను తీసుకున్న తర్వాతే అతని ఆస్తినంతటిని దోచుకొంటాడు.

“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.

“అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు. అప్పుడది, ‘నేను వదిలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది. అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది.”

యేసు ఈ మాటలను చెప్తుండగా, ఆ జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి” అని కేకలు వేసి చెప్పింది.

అందుకు యేసు, “అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు” అని చెప్పారు.

యోనా సూచన

జనుల గుంపులు పెరుగుతూ ఉండగా యేసు, “ఇది దుష్టతరము. వీరు సూచనను అడుగుతున్నారు కానీ వీరికి యోనా సూచన తప్ప మరి ఏ సూచన ఇవ్వబడదు. నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు” అని చెప్పారు.

నీ దేహానికి దీపం

“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేదా పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు.

పరిసయ్యులు ధర్మశాస్త్ర నిపుణులకు శ్రమ

యేసు మాట్లాడడం చాలించిన తర్వాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు; కాబట్టి ఆయన వెళ్లి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. అయితే యేసు యూదుల ఆచార ప్రకారం భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు.

అందుకు ప్రభువు అతనితో, “పరిసయ్యులైన మీరు పాత్రను, గిన్నెను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, దుష్టత్వంతో నిండి ఉన్నారు. అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది.

“పరిసయ్యులారా, మీకు శ్రమ. ఎందుకంటే, మీరు పుదీనా, మెంతులు ఇంకా అన్ని రకాల ఆకుకూరల్లో దేవునికి పదవ భాగం ఇస్తున్నారు, కాని న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మొదటివాటిని విడిచిపెట్టకుండా వెనుకటివాటిని పాటించాల్సింది.

“పరిసయ్యులారా మీకు శ్రమ, ఎందుకంటే సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండడానికి, సంత వీధుల్లో గౌరవం అందుకోవడానికి ఇష్టపడుతున్నారు.

“మీకు శ్రమ! మీరు సరిగా గుర్తుపట్టలేని సమాధుల్లా ఉన్నారు, తెలియక ప్రజలు వాటి మీద నడుస్తారు.”

ధర్మశాస్త్ర నిపుణులలో ఒకడు, “బోధకుడా, నీవిలా చెప్పి, మమ్మల్ని అవమానపరుస్తున్నావు” అని ఆయనతో అన్నాడు.

అందుకు యేసు, “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, మీరు మోయలేని బరువులను ప్రజలతో మోయిస్తూ, కనీసం ఒక వ్రేలి మోతనైనా మోసి వారికి సహాయపడరు.

“మీకు శ్రమ, ఎందుకంటే మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, కాని వారిని చంపింది మీ పితరులే. దీనిని బట్టి మీ పితరులు చేసిన వాటిని మీరు సమ్మతిస్తున్నట్లు సాక్ష్యమిస్తున్నారు; వారు ప్రవక్తలను చంపారు, మీరు వారికి సమాధులను కడుతున్నారు. ఇందుకే, దేవుడు మీ గురించి తన జ్ఞానంలో, ‘నేను వారికి ప్రవక్తలను, అపొస్తలులను పంపుతాను, వారిలో కొందరిని వారు చంపుతారు, మరికొందరిని హింసిస్తారు.’ కాబట్టి లోక ఆరంభం నుండి చిందించబడిన ప్రవక్తలందరి రక్తానికి ఈ తరం బాధ్యత వహిస్తుంది, అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు.

“ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానానికి చెందిన తాళపు చెవిని తీసివేసుకున్నారు. మీరే దానిలో ప్రవేశించలేదు, పైగా ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు.”

అక్కడినుండి యేసు బయటకు వెళ్లినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రశ్నలతో ఆయనను చిక్కులు పెట్టాలని, ఆయన చెప్పే మాటల్లో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు.

Source notes (6)
  1. Footnote కొ.ప్ర.లలో పరలోకంలో ఉన్న మా తండ్రి
  2. Footnote కొ.ప్ర.లలో వచ్చు గాక. మీ చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమి మీద జరుగును గాక.
  3. Footnote గ్రీకులో మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మాకు రుణపడి ఉన్నవారిని
  4. Footnote కొ.ప్ర.లలో శోధనలోకి నడిపించక, దుష్టుని నుండి విడిపించండి
  5. Footnote లేదా తన మంచి పేరు కాపాడుకోడానికైనా
  6. Footnote కొ.ప్ర.లలో రొట్టె అడిగితే, అతనికి రాయి ఇస్తాడా?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.