Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యోబు 26
యోబు
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
“శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు!
బలహీనమైన చేతిని నీవు రక్షించావా?
జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు?
ఎంత చక్కగా వివరించావు?
ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు?
ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి?
“జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు,
మృతులు వణుకుతున్నారు.
పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది;
నరకం1 ఆయనకు తేటగా కనిపిస్తుంది.
శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు;
శూన్యంలో భూమిని వేలాడదీసారు.
ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు
అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.
దాని మీద మేఘాలను వ్యాపింపజేసి
ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.
వెలుగు చీకట్ల సరిహద్దు వరకు
జలాలకు ఆయన హద్దును నియమించారు.
ఆయన గద్దింపుకు
ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.
ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది;
తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.
ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి;
ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.
ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే;
మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే!
అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”
Source notes (1)
- Footnote హెబ్రీలో అబద్దోను
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.