Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యిర్మీయా 48

మోయాబు గురించిన సందేశం

మోయాబు గురించి:

ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు:

“నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది.

కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది;

దాని కోట1 పడగొట్టబడి అవమానించబడుతుంది.

మోయాబును ఇకపై పొగడరు;

హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు:

‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’

మద్మేను2 ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు;

ఖడ్గం నిన్ను వెంటాడుతుంది.

హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి,

అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.

మోయాబు ధ్వంసమవుతుంది;

దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.3

వారు కొండపై నుండి లూహీతుకు,

ఏడుస్తూ వెళ్తున్నారు;

హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన

విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి;

ఎడారిలో పొదలా4 ఉండండి.

మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి,

మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు,

అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు

బందీగా వెళ్తాడు.

యెహోవా చెప్పారు కాబట్టి

నాశనం చేసేవాడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు,

ఒక్క పట్టణం తప్పించుకోదు.

లోయ పాడైపోతుంది,

పీఠభూమి నాశనమవుతుంది.

మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే,

అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది;

నివసించేవారు లేక,

దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.

“యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు!

రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!

“మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది,

ఒక బాన నుండి మరొక బానలో పోయబడని,

అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది,

అది చెరలోకి వెళ్లలేదు.

కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది,

దాని సువాసన మారలేదు.”

యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,

“రాబోయే రోజుల్లో నేను,

కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు,

వారు దాన్ని బయటకు కుమ్మరించి,

కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు.

ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు

ఎలా సిగ్గుపడ్డారో

మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు.

“ ‘మేము యోధులం,

యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?

మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి;

దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,”

అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

“మోయాబు పతనం సమీపించింది;

దాని విపత్తు త్వరగా వస్తుంది.

దాని చుట్టూ నివసించేవారలారా,

దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి;

‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది,

కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.

“దీబోను కుమార్తెలారా,

మీ కీర్తి నుండి క్రిందికి దిగి,

ఎండిపోయిన నేల మీద కూర్చుండి,

ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు

మీ మీదికి వస్తాడు

మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు.

అరోయేరులో నివసించేవారలారా,

రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి.

పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని,

‘ఏమైంది?’ అని అడగండి.

మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది.

రోదించండి, బిగ్గరగా ఏడవండి!

మోయాబు నాశనమైపోయిందని

అర్నోనులో ప్రకటించండి.

పీఠభూమికి తీర్పు తీర్చబడింది

హోలోనుకు, యహజుకు, మెఫాతుకు,

దీబోనుకు, నెబోకు, బేత్-దిబ్లాతయీము,

కిర్యతాయిముకు, బేత్-గమూలుకు, బేత్-మెయోనుకు,

కెరీయోతుకు, బొస్రాకు

దూరంగా దగ్గరగా ఉన్న మోయాబులోని అన్ని పట్టణాలకు శిక్ష విధించబడుతుంది.

మోయాబు కొమ్ము5 నరికివేయబడింది;

దాని బాహువు విరిగింది,”

అని యెహోవా ప్రకటిస్తున్నారు.

“ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి,

ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది.

మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది;

ఆమె హేళన చేయబడుతుంది.

ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా?

ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా,

నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా

ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?

మోయాబులో నివసించేవారలారా,

మీ పట్టణాలను విడిచిపెట్టి రాళ్ల మధ్య నివసించండి.

గుహ ముఖద్వారం దగ్గర

గూడు కట్టుకునే పావురంలా ఉండండి.

“మోయాబు గర్వం గురించి

దానికి అహంకారం గురించి

దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం,

దాని హృదయ అతిశయం గురించి విన్నాము.

దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు,

దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను,

మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను,

కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను.

షిబ్మా ద్రాక్షలారా,

యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను.

మీ కొమ్మలు సముద్రం6 వరకు వ్యాపించాయి;

అవి యాజెరు వరకు వ్యాపించాయి.

నాశనం చేసేవాడు,

పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.

మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి

ఆనందం, సంతోషం పోయాయి.

నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను;

ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు.

కేకలు వినిపించినప్పటికీ,

అవి ఆనందంతో వేసిన కేకలు కావు.

“నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి

కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు,

సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు,

వారి కేకలు వినిపిస్తున్నాయి.

క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో

తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని

నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

“కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది;

అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది.

వారు సంపాదించిన సంపద పోయింది.

ప్రతి తల గుండు చేయబడింది

ప్రతి గడ్డం కత్తిరించబడింది;

ప్రతి చేయి నరకబడింది

ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.

మోయాబులో ఇళ్ల పైకప్పులన్నిటి మీద

బహిరంగ కూడళ్లలో

దుఃఖం తప్ప మరేమీ లేదు,

పనికిరాని కుండను పగలగొట్టినట్లు

నేను మోయాబును పగులగొట్టాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

“అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో!

మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో!

మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి,

హేళనగా భయం పుట్టించేదిగా మారింది.”

యెహోవా ఇలా అంటున్నారు:

“చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద

రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది.

కెరీయోతు7 స్వాధీనం చేసుకోబడుతుంది,

బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి.

ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు

ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.

మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి

ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.

మోయాబు ప్రజలారా,

భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి”

అని యెహోవా ప్రకటిస్తున్నారు.

“భయాందోళన నుండి పారిపోయేవాడు

గొయ్యిలో పడిపోతాడు,

గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు

ఉచ్చులో చిక్కుకుంటాడు;

నేను మోయాబు మీదికి

దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,”

అని యెహోవా ప్రకటిస్తున్నారు.

“పారిపోయినవారు హెష్బోను నీడలో

బలహీనులై నిలబడి ఉన్నారు,

హెష్బోను నుండి అగ్ని,

సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి.

అది మోయాబు నొసళ్లను,

అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.

మోయాబూ, నీకు శ్రమ!

కెమోషు ప్రజలు నాశనమైపోయారు;

నీ కుమారులు బందీలుగా వెళ్లారు

నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు.

“అయితే నేను రాబోయే రోజుల్లో

మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,”

అని యెహోవా ప్రకటిస్తున్నారు.

దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.

Source notes (7)
  1. Footnote లేదా స్వాధీనమైంది మిస్గబు
  2. Footnote ఇది మోయాబీయుల పట్టణం పేరు; హెబ్రీలో మౌనం చేయబడుట
  3. Footnote కొ.ప్ర.లలో ఆ విషయాన్ని సోయరుకు ప్రకటించండి
  4. Footnote లేదా అరోయేరు లా
  5. Footnote కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది
  6. Footnote బహుశ మృత సముద్రం కావచ్చు
  7. Footnote లేదా పట్టణాలు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.