Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యిర్మీయా 28

అబద్ధ ప్రవక్త హనన్యా

అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను. బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను. నేను బబులోను రాజు కాడిని విరగ్గొట్టి, యూదా రాజును యెహోయాకీము కుమారుడునైన యెహోయాకీనును,1 బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన యూదావారందరిని తిరిగి ఇక్కడకు రప్పిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడి ఉన్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు ప్రవక్తయైన హనన్యాకు జవాబిచ్చాడు. యిర్మీయా ఇలా అన్నాడు, “ఆమేన్! యెహోవా అలా చేయును గాక! బబులోను నుండి యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను బందీలుగా తీసుకెళ్లిన వారందరిని తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి నీవు ప్రవచించిన మాటలను యెహోవా నెరవేరుస్తారు. అయితే, నీవు వింటుండగా, ఈ ప్రజలందరు వింటుండగా నేను చెప్పేది విను: నీకు నాకు ముందు ఉన్న ప్రవక్తలు చాలా దేశాలకు గొప్ప రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధాలు, విపత్తు, తెగులు గురించి చాలా కాలం నుండి ప్రవచించారు. అయితే క్షేమం కలుగుతుందని ప్రవచించే ప్రవక్త తన అంచనా నిజమైతేనే యెహోవా పంపిన వ్యక్తిగా గుర్తించబడతాడు.”

అప్పుడు ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని తీసి, దాన్ని విరిచి, ప్రజలందరి ముందు, “యెహోవా ఇలా అంటున్నారు: ‘రెండు సంవత్సరాల్లో అన్ని దేశాల మెడ మీద నుండి బబులోను రాజై నెబుకద్నెజరు కాడిని నేను అలాగే విరగ్గొడతాను.’ ” అది వినగానే యిర్మీయా ప్రవక్త అక్కడినుండి వెళ్లిపోయాడు.

ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా వచ్చింది: “నీవు, వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమిటంటే, నీవు చెక్క కాడి విరగ్గొట్టావు. కానీ దాని స్థానంలో నీవు ఇనుప కాడిని పొందుతావు. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేసేలా ఈ దేశాలందరి మెడపై నేను ఇనుప కాడిని ఉంచుతాను. అడవి జంతువులపై కూడా నేను అతనికి అధికారం ఇస్తాను.’ ”

అప్పుడు యిర్మీయా ప్రవక్త హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు: “విను హనన్యా! యెహోవా నిన్ను పంపలేదు, అయినప్పటికీ నీ అబద్ధాలను ఈ ప్రజలు నమ్మేలా చేశావు. కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను భూమి మీద నుండి తొలగించబోతున్నాను. మీరు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బోధించారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు చనిపోతారు.’ ”

అదే సంవత్సరం ఏడవ నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.

Source notes (1)
  1. Footnote హెబ్రీలో యెకొన్యా యెహోయాకీను యొక్క మరో రూపం

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.