Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యిర్మీయా 13
నారబట్టతో చేసిన నడికట్టు
యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి నార పట్టీ కొని నీ నడుముకు పెట్టుకో, అయితే అది నీళ్లతో తడపవద్దు.” కాబట్టి నేను యెహోవా ఆజ్ఞాపించినట్లే నడుముకు నార పట్టీ పెట్టుకున్నాను.
రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: “నీవు కొనుక్కుని నడుముకు పెట్టుకున్న పట్టీని తీసుకుని నీవిప్పుడు పేరతు1 నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ బండ సందులో దాన్ని దాచి పెట్టు.” కాబట్టి యెహోవా నాకు చెప్పినట్లే నేను వెళ్లి పేరతు దగ్గర దాన్ని దాచి పెట్టాను.
చాలా రోజుల తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఇప్పుడే నీవు పేరతు నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాచిపెట్టుమని నేను చెప్పిన పట్టీని తెచ్చుకో.” కాబట్టి నేను పేరతు నది ఒడ్డుకు వెళ్లి త్రవ్వి దాచిపెట్టిన స్థలంలో నుండి ఆ పట్టీని తీసుకున్నాను, కానీ ఇప్పుడు అది పాడై, పూర్తిగా పనికిరాకుండా పోయింది.
అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను. నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు! నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ద్రాక్ష తిత్తులు
“వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలి.’ ఒకవేళ వారు నీతో, ‘ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని అంటే, వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: దావీదు సింహాసనం మీద ఆసీనులైన రాజులు, యాజకులు, ప్రవక్తలు, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో సహా ఈ దేశంలో నివసించే వారందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
చెరను గురించిన బెదిరింపు
వినండి శ్రద్ధ వహించండి,
గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు.
చీకటి కమ్ముతున్న కొండలమీద
మీ పాదాలు తడబడక ముందే,
మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే
మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి.
మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు,
కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా
గాఢమైన చీకటిగా మారుస్తారు.
మీరు వినకపోతే
మీ గర్వాన్ని బట్టి
నేను రహస్యంగా ఏడుస్తాను;
యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది
కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి,
కన్నీరు కారుస్తాయి.
రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు,
“మీర మీ సింహాసనాలు దిగిరండి,
ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు
మీ తలల నుండి పడిపోతాయి.”
దక్షిణ వైపు ఉన్న పట్టణాలు మూసివేయబడతాయి,
వాటిని తెరవడానికి పట్టించుకునేవారే ఉండరు.
యూదా వారంతా బందీగా కొనిపోబడతారు,
ఏమి మిగులకుండ పూర్తిగా కొనిపోబడతారు.
కళ్లు పైకెత్తి
ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి.
నీకు అప్పగించబడిన మంద,
నీవు గొప్పలు చెప్పుకున్న గొర్రెలు ఎక్కడ?
నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని
యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు?
ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి
బాధ నీకు కలుగదా?
“నాకే ఎందుకు ఇలా జరిగింది?”
అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే
నీ అనేక పాపాల కారణంగానే
నీ వస్త్రాలు చింపబడ్డాయి
నీ శరీరం అసభ్యంగా తాకబడింది.
కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా?
చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా?
అలాగే చెడు చేయడం అలవాటైన
మీరు మంచి చేయలేరు.
“ఎడారి గాలికి కొట్టుకుపోయే పొట్టులా
నేను నిన్ను చెదరగొడతాను.
ఇదే నీ భాగం,
నేను నీకు నియమించిన భాగం,
ఎందుకంటే నీవు నన్ను మరచిపోయి
అబద్ధ దేవుళ్ళపై నమ్మకం ఉంచావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నీ అవమానం కనబడేలా
నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.
నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు,
నీ సిగ్గులేని వ్యభిచారం!
కొండలమీద, పొలాల్లో
నీ హేయమైన పనులు నేను చూశాను.
యెరూషలేమా, నీకు శ్రమ!
నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?”
Source notes (1)
- Footnote లేదా బహుశ యూఫ్రటీసు నది 5-7 వచనాల్లో కూడా ఉంది
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.