Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యెషయా 63

దేవుని తీర్పు, విమోచన దినం

రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి

బొస్రానుండి వస్తున్న ఇతడెవరు?

రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ

గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు?

“విజయాన్ని ప్రకటిస్తూ

రక్షించగల సమర్థుడనైన నేనే.”

నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లా

ఎర్రగా ఎందుకు ఉన్నాయి?

“నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను;

దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు.

నా కోపంలో వారిని త్రొక్కివేశాను

నా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను;

వారి రక్తం నా బట్టలమీద చిందింది,

నా బట్టలన్నిటికి మరకలయ్యాయి.

అది నేను పగతీర్చుకునే రోజు;

నేను విమోచించే సంవత్సరం వచ్చింది.

నేను చూశాను కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు;

ఎవరూ సహకారం అందించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను;

కాబట్టి నా సొంత చేయి నాకు రక్షణ ఇచ్చింది

నా కోపమే నన్ను ఆదుకుంది.

నేను నా కోపంతో దేశాలను త్రొక్కివేశాను

నా ఉగ్రతలో వారు మత్తెక్కేలా చేశాను

వారి రక్తాన్ని నేలమీద పారబోశాను.”

స్తుతి, ప్రార్థన

యెహోవా మనకు చేసినదంతటిని బట్టి,

యెహోవా కృపలను,

యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను.

అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి

ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి

నేను చెప్తాను.

ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు,

నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”;

కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు.

వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు,

ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు.1

ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు;

పూర్వ రోజులన్నిటిలో

ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.

అయినా వారు తిరుగుబాటు చేసి

ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు.

కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు

తానే వారితో యుద్ధం చేశారు.

అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను,

మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు

తన మందకాపరులతో పాటు

తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి?

తమలో తన పరిశుద్ధాత్మను

ఉంచిన ఆయనేరి?

మోషే కుడిచేతి వైపు

మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి?

తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి

వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?

మైదానంలో గుర్రం నడిచినట్లు

వారు పడిపోకుండా

లోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి?

లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా

యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది.

మీకు ఘనమైన పేరు రావాలని

మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.

పరలోకం నుండి,

గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి.

మీ ఆసక్తి మీ బలము ఏవి?

మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.

అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా

ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా

మాకు తండ్రి మీరే;

యెహోవా! మాకు తండ్రి మీరే,

పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.

యెహోవా! మేము మీ మార్గాల నుండి తొలగిపోయి తిరిగేలా ఎందుకు చేశారు?

మిమ్మల్ని భయపడకుండా మా హృదయాల్ని ఎందుకు కఠినపరిచారు?

మీ సేవకుల కోసం,

మీ స్వాస్థ్యమైన గోత్రాల కోసం తిరిగి రండి.

మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు

కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.

పూర్వం నుండి మేము మీ వారము;

కాని మీరెన్నడు వారిని పాలించలేదు,

వారు మీ పేరుతో పిలువబడలేదు.

Source notes (1)
  1. Footnote లేదా రక్షకుడు అక్కడ రాయబారి లేదా దూత కాదు కాని ఆయన సన్నిధే వారిని రక్షించింది

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.