Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యెషయా 60

సీయోను యొక్క మహిమ

“లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది,

యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.

చూడు, భూమిని చీకటి కమ్ముతుంది

కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది.

కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు.

ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.

దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి,

రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.

“నీ కళ్లు పైకెత్తి చూడు:

అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు;

నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు,

నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు.

అప్పుడు నీవు చూసి ప్రకాశిస్తావు.

నీ గుండె కొట్టుకొంటూ ఆనందంతో పొంగుతుంది;

సముద్ర సంపద నీ దగ్గరకు త్రిప్పబడుతుంది,

దేశాల సంపద నీ దగ్గరకు వస్తుంది.

ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో

నీ దేశం నిండిపోతుంది.

వారందరు షేబ నుండి వస్తారు,

బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు,

యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.

నీ దగ్గర కేదారు గొర్రె మందలన్నీ సమకూడతాయి.

నెబాయోతు పొట్టేళ్లు నీకు సేవ చేస్తాయి;

అవి నా బలిపీఠం మీద అర్పణలుగా అంగీకరించబడతాయి.

నేను నా మహిమగల మందిరాన్ని అలంకరిస్తాను.

“మేఘాల్లా, తమ గూళ్లకు ఎగిరిపోయే పావురాల్లా

ఎగిరే వీరెవరు?

నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి;

నీ దేవుడైన యెహోవాను

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి,

తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి,

దూరము నుండి నీ పిల్లలను

తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి,

ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.

“విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు,

వారి రాజులు నీకు సేవ చేస్తారు.

నేను కోపంలో నిన్ను కొట్టాను కాని,

నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను.

నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి,

జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి,

నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా

నిత్యం తెరిచే ఉంటాయి.

నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది;

అది పూర్తిగా నాశనమవుతుంది.

“నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి

లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు,

సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు.

నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.

నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు.

నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు,

యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క

సీయోనని వారు నిన్ను పిలుస్తారు.

“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి

నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా,

నేను నిన్ను శాశ్వత ఘనతగా

అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.

నీవు దేశాల పాలు త్రాగుతావు

రాజుల చనుపాలు త్రాగుతావు.

అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని

యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.

నేను ఇత్తడికి బదులు బంగారాన్ని

ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను.

నేను కర్రకు బదులు ఇత్తడిని

రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను.

నేను సమాధానాన్ని నీకు అధిపతిగా

నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.

ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు,

నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు.

అయితే నీవు నీ గోడలను రక్షణ అని

నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.

ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు,

చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు,

యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు.

నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.

నీ సూర్యుడికపై అస్తమించడు.

నీ చంద్రుడు క్షీణించడు.

యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు,

నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.

అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు;

వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు.

నా వైభవం కనుపరచడానికి

వారు నేను నాటిన కొమ్మగా

నా చేతుల పనిగా ఉంటారు.

నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు,

కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది.

నేను యెహోవాను;

సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.