Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెషయా 35
విమోచన పొందినవారి ఆనందం
ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి;
అరణ్యం సంతోషించి పూస్తుంది.
అది కుంకుమ పువ్వులా, ఒక్కసారిగా విచ్చుకుంటుంది;
అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది.
లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,
కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది;
వారు యెహోవా మహిమను
మన దేవుని వైభవాన్ని చూస్తారు.
బలహీనమైన చేతులను బలపరచండి,
వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;
భయపడేవారితో ఇలా అనండి:
“ధైర్యంగా ఉండండి, భయపడకండి;
మీ దేవుడు వస్తారు
ఆయన ప్రతీకారంతో వస్తారు.
దైవిక ప్రతీకారంతో
ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”
అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి
చెవిటి వారి చెవులు వినబడతాయి.
అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు,
మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది.
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి
ఎడారిలో కాలువలు పారతాయి.
మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది
ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి.
ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో
గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.
అక్కడ రహదారి ఉంటుంది;
అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది;
అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే.
అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు;
దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.
అక్కడ ఏ సింహం ఉండదు,
ఏ క్రూర జంతువు ఉండదు;
అవి అక్కడ కనబడవు.
విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.
యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు.
వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు;
నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది.
వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు.
దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.