Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యెషయా 30

మూర్ఖపు పట్టుగల దేశానికి శ్రమ

యెహోవా ఇలా అంటున్నారు,

“మూర్ఖులైన పిల్లలకు శ్రమ,

వారు నావి కాని ఆలోచనలు చేస్తారు,

నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ

పాపానికి పాపం జత చేస్తున్నారు;

వారు నన్ను సంప్రదించకుండా

ఈజిప్టుకు వెళ్తారు;

వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు,

ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.

కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది,

ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది.

వారి అధిపతులు సోయనులో ఉన్నా,

వారి రాయబారులు హనేసు చేరుకున్నా

వారికి సహాయకరంగా ఉపయోగకరంగా

ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే

ప్రజల కారణంగా

వారందరు సిగ్గుపరచబడతారు.”

దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం:

సింహాలు ఆడ సింహాలు,

నాగుపాములు ఎగిరే సర్పాలు,

కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు,

గాడిదల వీపుల మీద తమ ఆస్తిని

ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని

తమకు లాభం కలిగించని ఆ దేశానికి,

సహాయం వలన ప్రయోజనం లేని ఆ ఈజిప్టుకు వెళ్తారు.

కాబట్టి నేను దానిని

ఏమి చేయని రాహాబు1 అని పిలుస్తాను.

ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన

సాక్షంగా ఉండేలా

వారి కోసం పలక మీద దీనిని వ్రాయి

వీటిని గ్రంథస్తం చేయి.

ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు,

యెహోవా హెచ్చరికకు లోబడడానికి ఇష్టపడని పిల్లలు.

వారు దీర్ఘదర్శులతో,

“ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు.

అలాగే ప్రవక్తలతో,

“సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు.

మాకు అనుకూలమైన విషయాలు

భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి.

మా దారిని వదలండి,

ఈ మార్గం నుండి తొలగిపోండి.

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి చెప్తూ

మమ్మల్ని ఎదుర్కోవడం ఆపండి!”

కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే:

“మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు,

బాధించడాన్ని నమ్ముకుని,

మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి,

ఈ పాపం మీకు బీటలు తీసి

ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది,

అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.

అది మట్టికుండలా పగిలిపోతుంది,

కరుణ లేకుండా పగులగొట్టబడుతుంది,

పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని

కుండలో నుండి నీళ్లు తీయడానికి గాని

దానిలో ఒక్క పెంకు కూడా దొరకదు.”

ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:

“పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది,

ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది

కానీ మీకు ఇవేవి లభించవు.

మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు.

కాబట్టి మీరు పారిపోతారు!

మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు.

కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు!

పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా

కొండమీద ఉన్న జెండాలా

మీరు మిగిలేవరకు

ఒకరు గద్దించగా

మీలో వెయ్యిమంది పారిపోతారు;

అయిదుగురు గద్దించగా

మీరందరు పారిపోతారు.”

అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు;

కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

యెహోవా న్యాయం తీర్చే దేవుడు

ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!

యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు. ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు. మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు. అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.

మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి. భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి. గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.

చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో

యెహోవా నామం దూరం నుండి వస్తుంది;

ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి.

ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.

ఆయన ఊపిరి మెడ లోతు వరకు

ప్రవహించే ధారలా ఉంది.

ఆయన నాశనమనే జల్లెడలో దేశాలను గాలిస్తారు;

దారి తప్పించే కళ్లెమును

ప్రజల దవడలలో ఆయన అమర్చుతారు.

రాత్రివేళ పరిశుద్ధ పండుగను జరుపుకుంటున్నట్లుగా

మీరు పాడతారు

ఇశ్రాయేలుకు ఆశ్రయ కోటయైన

యెహోవా పర్వతానికి

పిల్లనగ్రోవి వాయిస్తూ వెళ్లే వారిలా

మీ హృదయాలు సంతోషిస్తాయి.

యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు,

భయంకరమైన కోపంతో దహించే అగ్నితో

మేఘ విస్పోటంతో, ఉరుముల తుఫానుతో, వడగండ్లతో

తన చేయి క్రిందికి రావడాన్ని ప్రజలు చూసేలా చేస్తారు.

యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది;

తన దండంతో ఆయన వారిని మొత్తుతారు.

యెహోవా తన శిక్షించే దండంతో

అష్షూరు మీద వేసే ప్రతి దెబ్బ

తంబుర సితారాల సంగీతంతో కలిసి ఉంటుంది.

ఆయన తన చేయి ఆడించి యుద్ధం చేస్తారు.

చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం2 సిద్ధపరచబడింది;

అది రాజు కోసం సిద్ధపరచబడింది.

విస్తారమైన అగ్ని, చెక్కతో

దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది;

యెహోవా ఊపిరి

మండుతున్న గంధక ప్రవాహంలా

దానిని రగిలిస్తుంది.

Source notes (2)
  1. Footnote పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు.
  2. Footnote అంటే, తోఫెతు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.