Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యెషయా 15

మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం

మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం:

ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం

పాడై నశిస్తుంది!

ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం

పాడై నశిస్తుంది!

దీబోను ఏడ్వడానికి గుడికి

తన క్షేత్రాలకు వెళ్తుంది;

నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది.

ప్రతి తల క్షౌరం చేయబడింది

ప్రతివాని గడ్డం గొరిగించబడింది.

వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు;

తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో

వారందరు రోదిస్తారు,

ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.

హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు,

యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది.

కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు,

వారి హృదయాలు క్రుంగిపోతాయి.

మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది;

వారిలో పారిపోయినవారు సోయరు వరకు,

ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు.

వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు

ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు;

హొరొనయీము వెళ్లే దారిలో

తమ నాశనం గురించి విలపిస్తారు.

నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి

గడ్డి ఎండిపోయింది;

వృక్ష సంపద ఉండదు

పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.

కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని

నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.

వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి;

వారి రోదన ఎగ్లయీము వరకు

వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.

దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి

కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను.

మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి

ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.