Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
హోషేయ 14
దీవెన రావాలంటే పశ్చాత్తాపపడాలి
ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా!
నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!
మాటలు సిద్ధపరచుకొని
యెహోవా దగ్గరకు రా.
ఆయనతో ఇలా చెప్పు:
“మా పాపాలన్నీ క్షమించండి
మమ్మల్ని దయతో స్వీకరించండి,
కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము.
అష్షూరు మమ్మల్ని రక్షించలేదు;
మేము యుద్ధ గుర్రాలను ఎక్కము.
మా చేతులు చేసిన వాటితో మేము,
‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము,
ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.”
“నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను,
మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను,
ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది.
నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను;
అతడు తామరలా వికసిస్తాడు.
లెబానోను దేవదారు చెట్టులా
అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి;
అతని చిగురు పెరుగుతుంది.
అతని వైభవం ఒలీవ చెట్టులా,
అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది.
అతని నీడలో ప్రజలు నివసిస్తారు;
వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు,
వారు ద్రాక్షలా వికసిస్తారు,
ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది.
ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని?
నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను.
నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని;
నా వలనే నీకు ఫలం కలుగుతుంది.”
జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి.
వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి.
యెహోవా మార్గాలు సరియైనవి;
నీతిమంతులు వాటిలో నడుస్తారు,
కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.