Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
హోషేయ 1
ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పాలన కాలంలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అనే ఇశ్రాయేలు రాజు కాలంలో, బెయేరి కుమారుడైన హోషేయకు యెహోవా వాక్కు వచ్చింది:
హోషేయ భార్య, పిల్లలు
యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం ఆరంభించినప్పుడు, యెహోవా ఇలా అన్నారు, “వెళ్లు, ఒక వ్యభిచారిణిని పెళ్ళి చేసుకో, ఆమెతో పిల్లలు కను, ఎందుకంటే ఈ దేశం కూడా ఒక వ్యభిచారిణిలా యెహోవాకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది.” కాబట్టి అతడు దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై అతనికి కుమారున్ని కన్నది.
అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను. ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరగ్గొడతాను.”
గోమెరు మళ్ళీ గర్భవతియై ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నారు, “ఆమెకు లో-రుహామా1 అని పేరు పెట్టు, ఎందుకంటే నేను ఇక ఇశ్రాయేలును ప్రేమించను వారిని ఏమాత్రం క్షమించను. అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.”
ఆమె లో-రుహామాను పాలు మాన్పించిన తర్వాత, గోమెరుకు మరో కుమారుడు పుట్టాడు. అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “అతనికి లో-అమ్మీ2 అని పేరు పెట్టు, ఎందుకంటే మీరు నా జనం కాదు, నేను మీ దేవుడను కాదు.
“అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది.
Source notes (2)
- Footnote లో-రుహామా అంటే ప్రేమించబడకపోవడం
- Footnote లో-అమ్మీ అంటే నా ప్రజలు కాదు
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.