Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
హగ్గయి 2
ఏడవ నెల ఇరవై ఒకటవ రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వార వచ్చిన యెహోవా వాక్కు: “నీవు యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు1 కుమారుడైన యెహోషువతో, మిగిలి ఉన్న ప్రజలందరితో మాట్లాడి ఇలా అడుగు, పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా? అయితే యెహోవా చెప్పేదేమంటే, ‘జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో! ప్రధాన యాజకుడవును యెహోజాదాకు కుమారుడవునైన యెహోషువా, ధైర్యం తెచ్చుకో! దేశ ప్రజలారా, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి! నేను మీకు తోడుగా ఉన్నాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. ‘మీరు ఈజిప్టు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ఇదే. నా ఆత్మ మీ మధ్య ఉంటుంది కాబట్టి భయపడకండి.’
“సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మరికొంత సమయంలో మరోసారి నేను ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని ఎండిన భూమిని కంపింపజేస్తాను. నేను ఇతర జనాలను కదిలించగా వారు తమకిష్టమైన వాటిని తీసుకువస్తారు; నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను’ ఇదే సైన్యాల యెహోవా మాట. వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట. ‘ఇప్పుడున్న మందిర వైభవం గత మందిర వైభవం కన్నా అధికంగా ఉంటుంది’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ స్థలంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.”
అపవిత్రమైన ప్రజలకు ఆశీర్వాదాలు
రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు వచ్చి తెలియజేసింది ఏంటంటే: “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ధర్మశాస్త్రం గురించి యాజకులను అడుగు: ఎవరైనా తమ వస్త్రపు చెంగులో ప్రతిష్ఠితమైన మాంసాన్ని తీసుకెళ్లి, ఆ చెంగుతో రొట్టెను గాని వంటకాన్ని గాని, ద్రాక్షరసాన్ని గాని, నూనెను గాని ఇతర ఏ ఆహారాన్ని గాని తాకితే అది పవిత్రం అవుతుందా?” అని అడిగితే,
యాజకులు, “కాదు” అన్నారు.
అప్పుడు హగ్గయి, “ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడై ఆ వస్తువులలో ఒకదాన్ని తాకితే అతడు తాకింది అపవిత్రం అవుతుందా?” అని అడిగితే,
యాజకులు, “అవును, అది అపవిత్రం అవుతుంది” అని జవాబిచ్చారు.
అందుకు హగ్గయి వారితో ఇలా అన్నాడు, “ఈ ప్రజలు, ఈ జనాలు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ అక్కడ వారు అర్పించేదంతా నా దృష్టికి అపవిత్రమే! ఇదే యెహోవా వాక్కు.
“ ‘ఆ రోజు నుండి మీరు దీని గురించి బాగా ఆలోచించండి. యెహోవా మందిరంలో రాయి మీద రాయి ఉంచే ముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి. ఒకడు ఇరవై కుప్పల ధాన్యం నాటగా పది కుప్పల ధాన్యమే వస్తుంది. ద్రాక్షగానుగ తొట్టిలో నుండి యాభై కొలతల ద్రాక్షరసం తీయడానికి వెళ్తే ఇరవై కొలతలు మాత్రమే ఉంటుంది. నేను నీ చేతి పనంతటిని తెగులుతో బూజుతో వడగండ్లతో నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి: గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా!
“ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”
యెహోవా ముద్ర ఉంగరంగా జెరుబ్బాబెలు
అదే నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు రెండవసారి వచ్చి తెలియజేసింది ఏంటంటే: యూదాదేశపు అధికారియైన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాను. నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు.
“ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”
Source notes (1)
- Footnote హెబ్రీలో యోజాదాకు
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.