Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఆది 27
ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, అతడు ఇక చూడలేనంతగా తన కళ్ళు మసకబారినప్పుడు, తన పెద్దకుమారుడైన ఏశావును, “నా కుమారుడా” అని పిలిచాడు.
అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. కాబట్టి నీవు నీ ఆయుధాలను అంటే నీ అంబులపొదిని విల్లును తీసుకుని అడవికి వెళ్లి జంతువును వేటాడి నాకు మాంసం తెచ్చిపెట్టు. నాకు ఇష్టమైన భోజనం రుచిగా సిద్ధం చేసి తీసుకురా, నేను చనిపోకముందు తిని నిన్ను దీవిస్తాను” అని చెప్పాడు.
అయితే ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు వేటాడేందుకు బహిరంగ పొలానికి వెళ్లిపోయాక, రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, “ఇదిగో, నీ తండ్రి నీ అన్న ఏశావుతో చెప్పడం నేను విన్నాను, ‘నేను చనిపోకముందు దానిని తిని యెహోవా సన్నిధిలో నిన్ను దీవిస్తాను’ అందుకు నీవు నా కోసం వేటాడి మాంసం తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా అని చెప్పాడు. కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి: మన మందలో నుండి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం వండి పెడతాను. అప్పుడు నీ తండ్రి తినడానికి దానిని తీసుకెళ్లు, అప్పుడు అతడు చనిపోకముందు నిన్ను దీవిస్తాడు” అని చెప్పింది.
యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది. ఒకవేళ నా తండ్రి నన్ను తాకిచూస్తే ఎలా? అతన్ని మోసం చేసినవాడనై, నా మీదికి ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకున్నవాన్ని అవుతాను” అని అన్నాడు.
అతని తల్లి అతనితో, “నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా” అని చెప్పింది.
కాబట్టి అతడు వెళ్లి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు, ఆమె అతని తండ్రికి ఇష్టమైన భోజనం వండింది. తర్వాత రిబ్కా ఇంట్లో ఉన్న తన పెద్దకుమారుడైన ఏశావు యొక్క శ్రేష్ఠమైన బట్టలు తీసుకుని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించింది. ఆమె అతని చేతులను, మెడ దగ్గర ఉండే నునుపైన భాగాలను మేక చర్మంతో కప్పింది. తర్వాత తాను చేసిన రుచిగల భోజనాన్ని, రొట్టెలను యాకోబు చేతికి ఇచ్చింది.
యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “నా తండ్రి” అని పిలిచాడు.
“నా కుమారుడా, నీవెవరివి?” అని అతడు అడిగాడు.
యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు.
ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు.
యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు.
అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు.
యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు. యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు. “నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు.
“అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు.
అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు.
యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు. అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు.
కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు,
“ఆహా, నా కుమారుని వాసన
యెహోవా దీవించిన
పొలం యొక్క సువాసన
దేవుడు నీకు ఆకాశపు మంచును,
భూమి యొక్క సారాన్ని,
సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.
జనాంగాలు నీకు సేవ చేయాలి,
జనాలు నీకు తలవంచాలి.
నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు,
నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి.
నిన్ను శపించేవారు శపించబడతారు
నిన్ను దీవించే వారు దీవించబడతారు.”
ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు. అతడు కూడా రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడతడు, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అతనితో అన్నాడు.
అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు.
అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు.
ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!”
తన తండ్రి మాట విన్న వెంటనే ఏశావు దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని అన్నాడు.
అయితే అతడు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు.
ఏశావు, “అతనికి యాకోబు1 అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని అడిగాడు.
ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు.
అందుకు ఏశావు తన తండ్రితో, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు.
అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు,
“నీ నివాసం
సారవంతమైన భూమికి దూరంగా,
పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది.
నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు
నీ సోదరునికి సేవ చేస్తావు,
అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు,
నీ మెడ మీద నుండి అతని కాడి
విరిచి పడవేస్తావు.”
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనను బట్టి ఏశావు తన సోదరుని మీద పగబెట్టుకున్నాడు, “నా తండ్రిని గురించి దుఃఖించే రోజులు సమీపంగా ఉన్నాయి; తర్వాత నా సోదరుడైన యాకోబును చంపేస్తా” అని తనకు తాను అనుకున్నాడు.
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు ఏమన్నాడో తెలుసుకుని, తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి అతనితో ఇలా అన్నది, “నీ అన్న ఏశావు నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి నా కుమారుడా! నేను చెప్పేది విను: హారానులో ఉన్న నా సోదరుడైన లాబాను దగ్గరకు పారిపో. మీ అన్న కోపం తగ్గే వరకు అక్కడ కొంతకాలం అతని దగ్గరే ఉండు. అతని కోపం చల్లారి, నీవు అతనికి చేసింది అతడు మరచిపోయిన తర్వాత, నేను నీకు కబురు పెడతాను. ఒక్క రోజే మీ ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి?”
తర్వాత రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని అన్నది.
Source notes (1)
- Footnote యాకోబు అంటే అతడు మడిమెను పట్టుకుంటాడు హెబ్రీ భాషషైలిలో అతడు మోసం చేస్తాడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.