Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

ఆది 12

అబ్రాముకు పిలుపు

యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.

“నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను,

నిన్ను ఆశీర్వదిస్తాను;

నీ పేరును గొప్పగా చేస్తాను,

నీవు దీవెనగా ఉంటావు.

నిన్ను దీవించే వారిని దీవిస్తాను,

శపించే వారిని శపిస్తాను;

నిన్ను బట్టి భూమి మీద ఉన్న

సర్వ జనాంగాలు దీవించబడతారు.”1

యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు. అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు.

అబ్రాము ఆ దేశం గుండా ప్రయాణమై షెకెములో మోరె యొక్క సింధూర వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి2 నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.

అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.

తర్వాత అబ్రాము ప్రయాణిస్తూ దక్షిణంగా వెళ్లాడు.

ఈజిప్టులో అబ్రాము

అప్పుడు దేశంలో కరువు వచ్చింది, అది తీవ్రంగా ఉన్నందుకు అబ్రాము కొంతకాలం ఉందామని ఈజిప్టుకు వెళ్లాడు. అతడు ఈజిప్టు ప్రవేశిస్తుండగా తన భార్య శారాయితో, “నీవు చాలా అందంగా ఉంటావని నాకు తెలుసు. ఈజిప్టువారు నిన్ను చూసినప్పుడు, ‘ఈమె అతని భార్య’ అని అంటారు. తర్వాత వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీవు నా చెల్లివని చెప్పు, అప్పుడు నీకోసం నన్ను మంచిగా చూసుకుంటారు, అప్పుడు నిన్ను బట్టి నా ప్రాణం సురక్షితంగా ఉంటుంది” అని చెప్పాడు.

అబ్రాము ఈజిప్టుకు వచ్చినప్పుడు ఈజిప్టువారు శారాయి అందంగా ఉందని చూశారు. ఫరో అధికారులు ఆమెను చూసి, ఆమె అందాన్ని ఫరో ఎదుట పొగిడారు, ఆమెను రాజభవనం లోనికి తీసుకెళ్లారు. ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు.

కాని యెహోవా అబ్రాము భార్య శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని ఘోరమైన వ్యాధులతో శిక్షించారు. కాబట్టి ఫరో అబ్రామును పిలిపించి, “నాకెందుకిలా చేశావు?” అని అన్నాడు. “ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? నేను ఆమెను నా భార్యగా చేసుకునేలా, ‘ఈమె నా చెల్లెలు’ అని నీవెందుకు నాతో చెప్పావు? ఇదిగో నీ భార్య, నీవు ఆమెను తీసుకుని వెళ్లిపో!” అని అన్నాడు. అప్పుడు ఫరో తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, వారు అతన్ని, అతని భార్యను, అతనితో ఉన్న ప్రతి దానితో పాటు పంపివేశారు.

Source notes (2)
  1. Footnote లేదా భూమి దీవించడానికి నీ పేరును వాడుకుంటారు ( 48:20 చూడండి)
  2. Footnote లేదా విత్తనం

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.