Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహెజ్కేలు 8
మందిరంలో విగ్రహారాధన
ఆరవ సంవత్సరం ఆరవ నెల అయిదవ రోజున నా ఇంట్లో నేను, యూదా పెద్దలు కూర్చుని ఉన్నప్పుడు, ప్రభువైన యెహోవా చేయి నా మీదికి వచ్చింది. నేను చూస్తుండగా ఒక మానవ ఆకారం1 కనిపించింది. అతని నడుము నుండి క్రిందికి నిప్పులా ఉన్నాడు, అక్కడినుండి అతని రూపం మెరుస్తున్న లోహంలా ప్రకాశవంతంగా ఉంది. ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడు సమతల మైదానంలో నేను చూసిన దర్శనంలో కనిపించినట్లే ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మళ్ళీ కనిపించింది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఉత్తరదిక్కు చూడు” అని చెప్పినప్పుడు, నేను ఉత్తరదిక్కు చూడగా అక్కడ బలిపీఠపు ఉత్తర ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహం కనిపించింది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు.
అప్పుడు ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ నేను చూడగా, నాకు గోడకు ఒక రంధ్రం కనిపించింది. ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఆ గోడ లోపలికి త్రవ్వు” అని చెప్పారు. నేను ఆ గోడ లోపలికి త్రవ్వగా ద్వారం ఒకటి కనిపించింది.
ఆయన నాతో, “లోపలికి వెళ్లి వారు ఇక్కడ చేస్తున్న దుర్మార్గమైన అసహ్యకరమైన పనులు చూడు” అని చెప్పారు. నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి. డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు. ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు. అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నీవు ఇది చూస్తున్నావా? అని యెహోవా అన్నాడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు.
అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు! కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.
Source notes (1)
- Footnote లేదా అగ్ని లాంటి ఆకారం
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.