Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహెజ్కేలు 3
ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, నీకు కనిపించిన దానిని తిని, ఈ గ్రంథపుచుట్టను తిను; తర్వాత ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారికి ప్రకటించు.” నేను నోరు తెరవగా ఆయన నాకు ఆ గ్రంథపుచుట్టను తినిపించారు.
అప్పుడు ఆయన, “మనుష్యకుమారుడా, నేనిచ్చే ఈ గ్రంథపుచుట్టను తిని నీ కడుపు నింపుకో” అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ గ్రంథాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.
ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి. నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను. నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు. కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు. వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను. నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.”
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మనస్సులో ఉంచుకో. బందీలుగా ఉన్న నీ ప్రజలు దగ్గరకు వెళ్లి వారు విన్నా వినకపోయినా, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే’ అని ప్రకటించు” అన్నారు.
ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది. అది జీవుల రెక్కలు ఒకదానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దము. వాటి ప్రక్కన ఉన్న చక్రాల శబ్దం గొప్ప గర్జన వంటి శబ్దంలా ఉంది. అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది. కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను.
కావలివానిగా యెహెజ్కేలు
ఏడు రోజులు గడిచిన తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి: “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు. నేను దుర్మార్గునితో, ‘నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, నీవు వాన్ని హెచ్చరించకపోయినా, లేదా వాని ప్రాణం కాపాడబడేలా చెడు మార్గాలను విడిచిపెట్టమని వాన్ని హెచ్చరించకపోయినా, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే, వాని చావుకు నిన్ను జవాబుదారీని చేస్తాను. అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా వారు తమ దుర్మార్గాన్ని, దుష్ట మార్గాలను వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు; కాని నీవు తప్పించుకుంటావు.
“నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను. ఒకవేళ పాపం చేయకూడదని నీవు నీతిమంతుని హెచ్చరించినప్పుడు అతడు పాపం చేయకపోతే అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఎందుకంటే అతడు ఆ హెచ్చిరికకు లోబడ్డాడు. అలాగే నిన్ను నీవు కాపాడుకుంటావు.”
అప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చి, ఆయన నాతో, “నీవు లేచి, సమతల మైదాన ప్రాంతానికి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని అన్నారు. కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను.
అప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నా కాళ్లమీద నన్ను నిలబెట్టాడు. తర్వాత యెహోవా నాతో ఇలా చెప్పారు: “నీ ఇంటి లోపలికి వెళ్లి, తలుపులు మూసివేసుకో. మనుష్యకుమారుడా, వారు నిన్ను త్రాళ్లతో కట్టి బంధించబోతున్నారు కాబట్టి నీవు వారి మధ్యకు వెళ్లవద్దు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను. కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.