Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహెజ్కేలు 11
యెరూషలేముపై దేవుని ఖచ్చితమైన తీర్పు
అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు. యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, వీరు చెడు కుట్రలు పన్నుతూ ఈ పట్టణంలో దుష్ట సలహాలు ఇస్తున్నారు. వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రవచించు; మనుష్యకుమారుడా, ప్రవచించు.”
అప్పుడు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పారు: “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు నాయకులారా, మీరు చెప్పేది అదే కాని మీ మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుసు. మీరు ఈ పట్టణంలో ఎంతోమందిని చంపారు; మీరు చంపిన శవాలతో పట్టణ వీధులు నిండిపోయాయి.
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు చంపి పట్టణంలో పడవేసిన వారి శవాలే మాంసం, ఈ పట్టణం ఒక కుండ అయితే నేను మిమ్మల్ని పట్టణంలో ఉండకుండా వెళ్లగొడతాను. మీరు ఖడ్గానికి భయపడుతున్నారు, కాబట్టి నేనే మీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని పట్టణంలో నుండి వెళ్లగొట్టి విదేశీయుల చేతికి మిమ్మల్ని అప్పగించి మీకు శిక్ష విధిస్తాను. ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ పట్టణం మీకు కుండగా ఉండదు, మీరు దానిలో మాంసం కారు. ఇశ్రాయేలు సరిహద్దులలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”
నేను ఈ విధంగా ప్రవచిస్తుండగానే బెనాయా కుమారుడైన పెలట్యా చనిపోయాడు. అప్పుడు నేను సాష్టాంగపడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో ప్రభువైన యెహోవా! ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారిని కూడా పూర్తిగా నిర్మూలిస్తావా?” అని మొరపెట్టాను.
ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారని వాగ్దానం
అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “మనుష్యకుమారుడా, మీ తోటి బందీల గురించి ఇతర ఇశ్రాయేలీయులందరి గురించి యెరూషలేము ప్రజలు, ‘వారు యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు; ఈ దేశం మా స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.
“కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దూరంగా ఉన్న జాతుల మధ్యకు నేను వారిని పంపినా, దేశాల మధ్య వారిని చెదరగొట్టినా వారు వెళ్లిన దేశాల్లో కొంతకాలం వారికి నేను పరిశుద్ధాలయంగా ఉన్నాను.’
“వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’
“వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచిన అసహ్యమైన విగ్రహాలను హేయమైన వాటిని తొలగిస్తారు. నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను. అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. అయితే తమ విగ్రహాలను అనుసరిస్తూ ఎప్పటిలాగే అసహ్యమైన పనులు చేసేవారికి వాటి ప్రతిఫలాన్ని వారి తల మీదికి రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది. యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకి వెళ్లి తూర్పున ఉన్న కొండ పైన ఆగింది. దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల1 దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది.
అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది. అప్పుడు యెహోవా నాకు చూపించిన వాటన్నిటిని బందీలుగా ఉన్నవారికి చెప్పాను.
Source notes (1)
- Footnote లేదా కల్దీయుల ఈ గ్రంథంలో అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.