Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

నిర్గమ 36

పరిశుద్ధాలయం యొక్క సేవ కోసం చేయవలసిన అన్ని రకాల పనులు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యెహోవా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన బెసలేలు ఒహోలీయాబు వలె నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం పని చేయాలి” అన్నాడు.

తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు. పరిశుద్ధాలయ నిర్మాణానికి ఇశ్రాయేలీయులు తెచ్చిన కానుకలన్నిటిని మోషే దగ్గర నుండి వారు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయం స్వేచ్ఛార్పణగా అతని దగ్గరకు కానుకలు తెస్తూనే ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాలయం యొక్క పనులన్నిటిని చేస్తున్న నైపుణ్యంగల పనివారంతా తాము చేస్తున్న పని విడిచి వచ్చి, మోషేతో, “యెహోవా చేయమని ఆజ్ఞాపించిన పనికి కావలసిన దానికన్నా ఎక్కువగా ప్రజలు తెస్తున్నారు” అని చెప్పారు.

అప్పుడు మోషే: “పరిశుద్ధాలయం కోసం ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఇకమీదట ఏ అర్పణ తీసుకురాకూడదు” అని ఒక ఆజ్ఞ ఇవ్వగా వారు దాన్ని శిబిరమంతటికి తెలియజేశారు. అప్పుడు ప్రజలు కానుకలు తీసుకురావడం మానుకున్నారు. ఎందుకంటే, వారు తెచ్చిన కానుకలు ఆ పని అంతా పూర్తి చేయడానికి కావలసిన దానికన్నా ఎక్కువ.

సమావేశ గుడారం

ఆ పనివారిలో నిపుణులైన వారందరు పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేశారు; వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లించారు. తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.1 వారు అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేశారు; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేశారు. తర్వాత వారు ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేశారు, రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేశారు. అంతేకాక వారు ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేశారు. తర్వాత వారు యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.

వారు సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేశారు. పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.2 వారు అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలిపారు. అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు. దాన్ని ఒకటే గుడారమయ్యేలా వారు యాభై ఇత్తడి గుండీలు తయారుచేశారు. ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో గుడారం కోసం పైకప్పును దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేశారు.

వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు. ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి,3 రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చారు. వారు సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేశారు. సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు. మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. వాటి క్రిందకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు. పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు, సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. ఈ రెండు మూలల వద్ద చట్రాలు క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడ్డాయి; రెండూ ఒకేలా ఉన్నాయి. అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉన్నాయి.

అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు, రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేశారు. చట్రాల మధ్యలో ఉండే అడ్డకర్రను ఈ చివరి నుండి ఆ చివరి వరకు చేశారు. వారు చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేశారు. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించారు.

వారు నీలం ఊదా ఎరుపు రంగుల్లో ఒక తెరను పేనిన సన్నని నారతో చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించారు. వారు దాని కోసం తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించారు. వాటికి బంగారు కొక్కేలు చేసి, వాటికి నాలుగు వెండి దిమ్మలు వేశారు. గుడారపు ప్రవేశ ద్వారానికి వారు నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పని చేసిన తెర తయారుచేశారు. వారు వాటికోసం అయిదు స్తంభాలు అలాగే కొక్కేలు చేశారు. వారు స్తంభాల పైభాగాలను, వాటి పట్టీలను బంగారంతో పొదిగించారు, అలాగే వాటికోసం అయిదు ఇత్తడి దిమ్మలు చేశారు.

Source notes (3)
  1. Footnote అంటే, సుమారు 13 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు
  2. Footnote అంటే, సుమారు 14 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు
  3. Footnote అంటే, సుమారు 4.5 మీటర్ల పొడవు, 70 సెం.మీ. వెడల్పు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.