Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ద్వితీయో 6
మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి
మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే. మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు. ఇశ్రాయేలూ విను, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు శ్రేయస్సు కలిగి అధికంగా అభివృద్ధి కలిగేలా మీరు వాటికి లోబడి ఉండేలా జాగ్రత్త వహించండి.
ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన దేవుడైన యెహోవా, యెహోవా ఒక్కరే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి. వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి. వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి.
మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన రీతిగా మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకువచ్చి మీరు కట్టని విశాలమైన మంచి పట్టణాలను, మీరు సమకూర్చని అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇళ్ళను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవల తోటలను మీకు ఇస్తారు; మీరు తిని తృప్తిపొందిన తర్వాత, బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్తగా ఉండండి.
మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి. ఇతర దేవుళ్ళను అనగా మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను అనుసరించకూడదు; మీ మధ్యనున్న మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, ఆయన కోపం మీమీద రగులుకొని దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేస్తారు. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను పరీక్షించినట్లు ఆయనను పరీక్షించకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన మీకు ఇచ్చిన నిబంధనలను, శాసనాలను జాగ్రత్తగా పాటించండి. మీకు మేలు కలిగేలా యెహోవా చెప్పినట్లు మీ శత్రువులందరిని మీ ఎదుట నుండి తరిమివేసి యెహోవా మీ పూర్వికులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి.
భవిష్యత్తులో, “మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన నిబంధనలు, శాసనాలు, చట్టాలకు అర్థం ఏంటి?” అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వారితో, “మనం ఈజిప్టులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు, యెహోవా బలమైన హస్తంతో మనలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చారు. మన కళ్లముందు యెహోవా ఈజిప్టు మీద, ఫరో మీద, అతని ఇంటివారందరి మీద గొప్ప, భయంకరమైన అసాధారణ గుర్తులను, అద్భుతాలను చేశారు. ఆయన మన పూర్వికులతో ప్రమాణం చేసిన దేశంలోనికి మనలను తీసుకువచ్చి దానిని మనకు ఇవ్వడానికి అక్కడినుండి మనలను బయటకు తీసుకువచ్చారు. మనం ఎల్లప్పుడు వర్ధిల్లుతూ, నేడు ఉన్నట్లుగా మనం బ్రతికి ఉండడానికి ఈ శాసనాలన్నిటికి లోబడి మన దేవుడైన యెహోవాకు భయపడమని యెహోవా మనకు ఆజ్ఞాపించారు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఎదుట మనం ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా అనుసరిస్తే అది మనకు నీతిగా పరిగణించబడుతుంది” అని చెప్పండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.