Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ద్వితీయో 11
యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడండి
మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మీకు చెప్పేవాటన్నిటిని, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాలి. మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని; ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు అతని దేశమంతటికి ఆయన చేసిన అసాధారణ గుర్తులు; ఈజిప్టు సైన్యానికి, దాని గుర్రాలకు రథాలకు ఆయన చేసింది, వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటితో వారిని కప్పివేయడం, యెహోవా వారిపై నిత్య నాశనం ఎలా తెచ్చారో మీరు చూశారు. మీరు ఈ చోటికి చేరుకునేవరకు అరణ్యంలో ఆయన మీ కోసం ఏమి చేశారో చూసింది మీ పిల్లలు కాదు. ఆయన రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన దానిని అనగా ఇశ్రాయేలీయులందరి మధ్యలో భూమి నోరు తెరిచి వారిని వారు కుటుంబాలను వారి గుడారాలను వారికి చెందిన ప్రతి జీవిని మ్రింగివేసిన విధానాన్ని మీరు చూశారు. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటిని చూసింది మీ సొంత కళ్లు.
కాబట్టి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటిని పాటించండి, అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలోనికి వెళ్లడానికి బలం కలిగి ఉంటారు, తద్వార వారికి వారి సంతానానికి ఇస్తానని యెహోవా మీ పూర్వికులతో వాగ్దానం చేసిన దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అధిక కాలం జీవిస్తారు. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనం చేసుకోబోయే దేశం ఆకాశపు వర్షాన్ని త్రాగే పర్వతాలు లోయలు ఉన్న దేశము. అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.
కాబట్టి ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలకు నమ్మకంగా లోబడితే, మీరు మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. అప్పుడు మీ దేశంలో సకాలంలో తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను. అప్పుడు మీరు ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షరసాన్ని, ఒలీవ నూనెను సమకూర్చుకోవచ్చు. మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను; మీరు తిని తృప్తి చెందుతారు.
జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు. అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని ఆయన ఆకాశాన్ని మూసేస్తారు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, యెహోవా మీకు ఇవ్వబోయే ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరలోనే నశించిపోతారు. ఈ నా మాటలు మీ మనస్సులో హృదయంలో ఉంచుకోండి; వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. వాటిని మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. మీ ఇంటి ద్వారబంధాల మీద ద్వారాల మీద వాటిని వ్రాయండి, తద్వార యెహోవా మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ పిల్లలు ఎక్కువ రోజులు అనగా భూమిపై ఆకాశం ఉన్నంత కాలం మీరు జీవిస్తారు.
మీరు పాటించాలని నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రతగా పాటిస్తే అనగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జనాంగాలన్నిటిని వెళ్లగొడతారు. మీకంటే విస్తారమైన, బలమైన దేశాలను మీరు వెళ్లగొడతారు. మీరు అడుగుపెట్టే ప్రతి చోటు మీదే అవుతుంది: ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దులు వ్యాపిస్తాయి. మీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీరు వెళ్లే దేశమంతటికి మీరంటే వణుకును భయాన్ని పుట్టిస్తారు.
చూడండి, ఈ రోజు నేను మీ ముందు దీవెనను శాపాన్ని ఉంచుతున్నాను. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడితే మీకు దీవెన; మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం. మీరు స్వాధీనం చేసుకోబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చిన తర్వాత, గెరిజీము పర్వతం మీద దీవెనను ఏబాలు పర్వతంమీద శాపాన్ని ప్రకటించాలి. మీకు తెలిసినట్లు, ఈ పర్వతాలు యొర్దాను అవతల సూర్యుడు అస్తమించే దిక్కుకు వెనుక మోరె లోని సింధూర వృక్షాల దగ్గర గిల్గాలు ప్రాంతంలో ఉన్న అరాబాలో నివసించే కనానీయుల సరిహద్దులో ఉన్నాయి. మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను నది దాటబోతున్నారు. మీరు దానిని స్వాధీనం చేసుకుని దానిలో నివసించినప్పుడు, ఈ రోజు నేను మీ ముందు ఉంచిన అన్ని శాసనాలను చట్టాలను తప్పనిసరిగా పాటించండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.